Bali: ఆస్ట్రేలియా దంపతులకు... వైన్ బాటిల్ షాక్

Bali: ఆస్ట్రేలియా దంపతులకు... వైన్ బాటిల్ షాక్
బాలీలో ఆస్ట్రేలియా దంపతులకు షాక్; ట్రిప్పు మొత్తం ఒకెత్తు అయితే... వైన్ బాటిల్ మరొక ఎత్తు అయిందంటూ వాపోతున్న జంట...
అందమైన బీచ్ లతో పాటూ అదిరిపోయే ఆతిథ్యాన్ని ఆశ్వాదించాలని కోరుకునే మధ్యతరగతి వారు బడ్జెట్ లోనే ఓ చక్కని ట్రిప్ వేయాలంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు బాలి. ఇలానే అనకుంది ఆస్ట్రేలియాకు చెందిన ఓ గే జంట. చక్కగా బాలీలో విడిది చేసి ఊరంతా చట్టాపట్టాలేశారు. ఇక ట్రిప్ చివరకు వచ్చేసరికి ఓ మంచి రెస్టారెంట్ కు వెళ్లి సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. బాలీలోనే ఓ అందమైన రెస్టారెంట్ కు వెళ్లారు. 170 డాలర్లు విలువ చేసే ఓ మంచి వైన్ ఆర్డర్ చేసి మజా చేసుకున్నారు. అయితే వైన్ ఆర్డర్ చేస్తున్నప్పుడే వైటర్ ముఖంలో వారికి ఓ రకమైన ఫీలింగ్ కనిపించింది. కానీ, ఉరకలెత్తే ఉత్సాహంలో అప్పుడు ఏమీ అర్ధంకాలేదు. ఆ తరువాత ఛెఫ్ కూడా బయటకు వచ్చి వారిని ప్రత్యేకంగా పలుకరించి వెళ్లాడు. హోటల్ స్టాఫ్ మొత్తం వారికి రాచ మర్యాదలు చేశారు. ఇక ఈ ఆనందంతో సుష్టిగా తిని, పీకల దాకా తాగి బిల్ కట్టి గుండెల నిండా బోలెడంత సంతోషాన్ని మోసుకెళ్లారు. అయితే మరుసటి రోజు పొద్దున్నే లేచిన వారికి పెద్ద షాకే తగిలింది. ఫోన్ కు వచ్చిన మెసేజ్ చూసుకున్న వారికి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయింది. ముందు రోజు రాత్రి రెస్టారెంట్ వారు తమ కార్డ్ నుంచి సుమారు 2వేల డాలర్లు గీకారని వారికి అర్ధమైంది. దీంతో రాత్రి వారు తాగిన వైన్ ధర 170 డాలర్లు కాదని, 1700 డాలర్లు అని తెలుసుకుని షాక్ అయ్యారు. అంటే ట్రిప్పు సాంతం తాము ఖర్చు చేసినదానికన్నా బాటిల్ వైన్ ధరే ఎక్కువ అని గుర్తించిన ఆ జంట పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లు ఉంది. ఇదే విషయాన్ని ఫేస్ బుక్ లో షేర్ చేసుకున్నారు ఆ జంట. ఇంకే ముంది ప్రస్తుతం ఈ ముచ్చట కాస్తా వైరల్ గా మారింది.

Tags

Read MoreRead Less
Next Story