Bangladesh: బంగ్లాదేశ్‌లో నేడే సార్వత్రిక ఎన్నికలు..

Bangladesh: బంగ్లాదేశ్‌లో నేడే సార్వత్రిక ఎన్నికలు..
పోలింగ్‌ను బహిష్కరించిన ప్రతిపక్షాలు

పొరుగునే ఉన్న బంగ్లాదేశ్‌లో నేడు సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఆ దేశ పార్లమెంట్‌కు పోలింగ్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 350 స్థానాలు ఉన్న ఆ దేశ పార్లమెంట్ జాతీయ సంగ్సద్ కు జరిగే 12వ విడత ఎన్నికలివి. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఆవామీ లీగ్ అధికారంలో ఉంది. పార్లమెంట్‌లో ఆ పార్టీకి ఉన్న సీట్ల సంఖ్య 306. ఈ పార్టీ అధినేత్రి షేక్ హసీనా ప్రస్తుతం ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. జాతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తోంది. ఆ పార్టీకి ఉన్న స్థానాల సంఖ్య 27. భారత్ తరహాలోనే అయిదేళ్లకోసారి సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయక్కడ.

ఈ సారి కూడా ఆవామీ లీగ్ అధికారంలోకి రావొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ ఎన్నికలను ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బహిష్కరించింది. షేక్ హసీనా తన బాధ్యతల నుంచి తప్పుకొని, ఎన్నికల నిర్వహణ ప్రక్రియను తటస్థ వ్యవస్థకు అప్పగించాలనేది ఆ పార్టీ డిమాండ్. మాజీ ప్రధాని ఖలీదా జియాను విడుదల చేయాలంటూ నినదిస్తోంది. 48 గంటల జాతీయస్థాయి బంద్‌కు పిలుపునిచ్చింది.

ఇప్పటికే శుక్రవారం రాత్రి ఆందోళనకారులు ఎక్స్‌ప్రైస్ రైలుకు నిప్పటించిన సంగతి తెలిసిందే. దీంతో రైలులోని నాలుగు బోగీలు దగ్దమయ్యాయి. ఐదుగురు ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని చనిపోయారు. అనేక మందికి గాయాలయ్యాయి. మొత్తం 300 స్థానాలకు జరగనున్న ఈ పోలింగ్ ప్రక్రియలో 11 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 1500 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్ కోసం మొత్తం 42 వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 27 రాజకీయ పార్టీలు బరిలోకి దిగుతున్నాయి. మాజీ అధ్యక్షుడు హెచ్‌ఎమ్ ఇర్షాద్ జాతీయ పార్టీ, తృణముల్ బీఎన్‌పీ, ఇస్లామీ ఫ్రంట్, ఇస్లామీ ఐక్యో జోట్, క్రిషక్ శ్రామిక జనతా లీగ్, గణ ఫోరమ్,గణ ఫ్రంట్ తదితర పార్టీలు ఎన్నికల బరిలో ఉన్నాయి. కాగా ఈ నెల 8న ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story