బంగ్లాదేశ్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన క్రికెటర్

బంగ్లాదేశ్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన క్రికెటర్
ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ మగురా-1 పార్లమెంట్ స్థానం నుంచి విజయం

రాజకీయ నాయకుడిగా మారిన బంగ్లాదేశ్ క్రికెటర్, కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ( shakib al hasan ) తొలి విజయాన్ని అందుకున్నాడు. బంగ్లాదేశ్ లో ( bangladesh ) జరిగిన ఎన్నికల్లో మరోసారి షేక్ హసీనా పార్టీ ( Awami League party ) ఘన విజయం సాధించింది. దీంతో మళ్లీ అధికారాన్ని చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. వరుసగా నాలుగోసారి షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ అధికార పీఠాన్ని చేపట్టబోతోంది. అవామీ లీగ్ పార్టీ మూడింట రెండొంతుల స్థానాలను దక్కించుకుంది. బంగ్లాదేశ్ లో ప్రధాన ప్రతిపక్షం బీఎన్పీ, దాని మిత్రపక్షాలు ఎన్నికలను బహిష్కరించాయి. దీంతో ఆ పార్టీలన్నీ ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉన్నాయి. దీంతో మొత్తం 300 స్థానాలకుగాను 299 సీట్లకు జరిగిన ఎన్నికల్లో 200 స్థానాల్లో అనామీ లీగ్ పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్నికల్లో విజయంతో 76ఏళ్ల షేక్ హసీనా వరుసగా ఐదోసారి ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించనున్నారు.

రాజకీయ నాయకుడిగా మారిన బంగ్లాదేశ్ క్రికెటర్, కెప్టెన్ షకీబ్ అల్ హసన్ తొలి విజయాన్ని అందుకున్నాడు. బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో అవామీ లీగ్ పార్టీ తరపున పోటీ చేసి, మగురా-1 సీటు నుంచి పోటీ చేసి 1,50,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచాడు. తన సమీప ప్రత్యర్థి కాజీ రెజాల్ హుస్సేన్‌కి 45,993 ఓట్లు మాత్రమే పడడం గమనార్హం. కాగా ఎన్నికల ప్రచారం కోసం షకీబ్ ఉల్ హసన్‌ క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. కాగా షకీబ్ చివరిసారిగా వన్డే ప్రపంచ కప్ 2023లో ఆడాడు. బంగ్లా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. వరల్డ్ కప్ తర్వాత బంగ్లాదేశ్ - న్యూజిలాండ్ తలపడ్డప్పటికీ షకీబ్ అల్ హసన్ ఆడలేదు.


స్పిన్ ఆల్‌ రౌండర్ అయినా 36 ఏళ్ల షకీబ్ అల్ హసన్ అంతర్జాతీయ క్రికెట్‌లో 66 టెస్టులు, 247 వన్డేలు, 117 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 39 సగటుతో 4,454 పరుగులు చేసిన షకీబ్.. బౌలింగ్‌లో 233 వికెట్లు పడగొట్టాడు. 247 వన్డేల్లో 37 సగటుతో 7,570 పరుగులు చేసిన షకీబ్.. బౌలింగ్‌లో 317 వికెట్లు తీశాడు. టీ20ల్లో 23 సగటుతో 2,382 పరుగులు చేసిన షకీబ్.. బౌలింగ్‌లో 140 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఎంపీగా విజయం సాధించిన షకీబ్ అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.


Tags

Read MoreRead Less
Next Story