Bird Flu: విజృంభిస్తున్న బర్డ్‌ ఫ్లూ

Bird Flu: విజృంభిస్తున్న బర్డ్‌ ఫ్లూ
కరోనా కంటే డేంజర్ డేస్ వస్తాయంటున్న నిపుణులు

కోవిడ్‌ను మించిన గండం అమెరికాను గడగడలాడిస్తోంది. బర్డ్‌ ఫ్లూతో అగ్రరాజ్యం అల్లాడుతోంది. H5N1తో ప్రపంచదేశాలు కూడా వణికిపోతున్నాయి. కోవిడ్‌ కంటే 100 రెట్లు ప్రాణాంతకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బర్డ్‌ ఫ్లూ ఎంత ప్రమాదకరమో పరిస్థితి కళ్లకు కడుతోంది. ఒక దాని తర్వాత ఒకటి మానవాళిపై పంజా వసురుతున్నాయి. కరోనా మహమ్మారి మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ఇంకా చెదిరిపోకముందే మరో వేరియంట్‌ వెంటాడుతోంది. అమెరికాలో వెలుగుచూసిన బర్డ్‌ ఫ్లూను కోవిడ్‌ను మించిన విలయంగా అభివర్ణిస్తున్నారు నిపుణులు. కరోనాను మించిన మృత్యుకౌగిలి అమెరికాలో ఇప్పుడు అలజడి రేపుతోంది. టెక్సాస్‌, కాన్సాస్‌ వంటి రాష్ట్రాల్లో వెలుగుచూసిన బర్డ్‌ ఫ్లూతో పౌల్ట్రీ రంగం ప్రశ్నార్ధకంగా మారింది. కోళ్లలో బర్డ్‌ ఫ్లూ ఉన్నట్టు మిచిగాన్‌ స్టేట్‌ యూనివర్శిటీలోని వెటర్నరీ డయాగ్నోస్టిక్ లాబొరేటరీ గుర్తించడంతో, ఆయా ప్లాంట్లలో కోళ్ల ఉత్పత్తికి బ్రేక్‌ పడింది.

ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా-H5N1 వైరస్‌ సాధారణంగా పక్షులకు సోకే వ్యాధి. కానీ ఈ వ్యాధి క్షీరదాల్లోనూ బయటపడుతోంది. క్షీరదాల్లో ఈ కేసులు పెరిగితే మానవులకు కూడా ప్రమాదమే అన్నది నిపుణుల వాదన. అంతేకాదు దీని వల్ల కొత్త వైరస్‌లు పుట్టి మనుషులు, జంతువులకు కూడా హాని కలిగించే ప్రమాదం లేకపోలేదు. ఈ ప్రమాదాన్ని గుర్తించిన డబ్ల్యూహెచ్‌ఓ మనుషులకు వ్యాపిస్తే మరణాల రేటు గణనీయంగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. టెక్సాస్‌లో ఓ కార్మికుడి ఆరోగ్యం క్షీణించడంతో ఈ విషయం వెలుగుచూసింది. అతన్ని వెంటనే ఐసోలేషన్‌ చేసిన అధికారులు, ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. పశువుల నుంచి మనిషికి బర్డ్‌ఫ్లూ సోకడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు 2022లోనూ అమెరికాలోని కొలరాడోలో ఒక వ్యక్తికి వైరస్‌ సోకినప్పటికీ అతడికి కోళ్ల నుంచి సోకింది. అమెరికాలోని ఆవుల మందల్లో H5N1 వైరస్‌ సోకుతోంది. కాన్సాస్‌, న్యూమెక్సికో, టెక్సాస్‌, ఓహియో, ఇడాహో, మిషిగన్‌లో పాడి పశువులకు బర్డ్‌ఫ్లూ సోకినట్టు గుర్తించారు. పక్షుల ద్వారా పశువులకు వైరస్‌ సోకినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు.

కరోనాను మించి ప్రాణనష్టం జరిగే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్న క్రమంలో ప్రపంచవ్యాప్తంగా మిగతా దేశాలు కూడా అలర్ట్‌ అయ్యాయి. H5N1 వైరస్‌ను తొలిసారి 1996లో చైనాలోని పక్షుల్లో గుర్తించారు. ఆ తర్వాత ఏడాది హాంకాంగ్‌లో వైరస్‌ పక్షుల నుంచి మనుషులకు వ్యాపించింది. అప్పుడు 18 మంది మృత్యువాతపడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 2003 నుంచి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 887 మంది H5N1 బర్డ్‌ఫ్లూ బారిన పడగా 462 మంది మృతిచెందారు. వైరస్‌ బారిన పడుతున్న ప్రతి 100 మందిలో 52 మంది మరణిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కొవిడ్‌లో మరణాల రేటు 0.1 శాతం మాత్రమే ఉన్నప్పటికీ లక్షలాది మందిని బలిగొన్నది. H5N1లో మరణాల రేటు 52 శాతం కాబట్టి ఇది కొవిడ్‌ కంటే 100 రెట్లు ప్రాణాంతకం కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story