California: కాలిఫోర్నియాను వణికిస్తున్న తుపాను

California: కాలిఫోర్నియాను వణికిస్తున్న తుపాను
విద్యుత్ సరఫరాకు విఘాతం

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రాన్ని తుఫాను వణికిస్తోంది. బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తుండడంతో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. తుపాను దెబ్బకు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విద్యుత్‌ వ్యవస్థ.. దెబ్బతినడంతో వేలాది మంది ప్రజలు అంధకారంలో చిక్కుకున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో చెట్లు విరిగిపడిన ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కాలిఫోర్నియా, అరిజోనా, నెవాడాల్లో ప్రస్తుతం దాదాపు 3 కోట్ల మంది ప్రజలు వరద ముప్పులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

తుఫాను ధాటికి అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం అతలాకుతలమవుతోంది. తుఫాను కారణంగా కుంభవృష్టి కురవడంతో పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. చాలా చోట్ల వీధుల్లోకి బురద కొట్టుకొచ్చింది. పదుల సంఖ్యలో వాహనాలు బురదలో కూరుకుపోయాయి.నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. కొన్నిచోట్ల పదుల సంఖ్యలో చెట్లు నెలకొరిగాయి. వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమవడంతో వేలాదిమంది ప్రజలు నిరాశ్రయాలయ్యారు. శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో చెట్లు విరిగిపడిన ఘటనల్లో ముగ్గరు ప్రాణాలు కోల్పోయారు. తుఫాను కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ప్రతికూల వాతావరణం వల్ల కొన్ని విమానాలు ఆలస్యంగా నడవగా, మరికొన్ని రద్దయ్యాయి. పలుప్రాంతాల్లో విద్యుత్‌ సరాఫరా నిలిచిపోవడంతో లక్షలాది ప్రజలు అంధకారంలో చిక్కుకున్నారు. సోమవారం నాడు కాలిఫోర్నియా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8 లక్షల 30 వేల మంది చీకట్లో గడిపారని అధికారులు తెలిపారు.


వరదల ధాటికి నదులు ఉప్పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. లాస్ ఏంజెల్స్‌ నది నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. నదిలో చిక్కుకున్న ఓ వ్యక్తిని రెస్క్యూ సిబ్బంది హెలికాప్టర్‌ సహాయంతో రక్షించారు. మరోచోట వరదనీటిలో చిక్కుకుపోయిన ఓ వ్యక్తిని కాపాడారు. బాధితుడు ప్రయాణిస్తున్న కారు వరదల్లో చిక్కుకుంది. వరద అంతకంతకూ పెరుగుతుండంతో తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ వ్యక్తి..... కారుపైకి ఎక్కి సహాయం కోసం కేకలు వేశాడు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకొని ఆ వ్యక్తిని సురక్షితంగా కాపాడారు. బలమైన గాలులకు తోడు... రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఎనిమిది కౌంటీల్లో అత్యవసర పరిస్థితిని విధించారు. తుఫాను కారణంగా పసిఫిక్‌ తీరహైవేను మూసివేయాలనినిర్ణయించినట్లు తెలిపారు.


కాలిఫోర్నియా దక్షిణాన ఉన్న పర్వతప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని అక్కడి ప్రభుత్వం కోరింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని లాస్‌ ఏంజిలెస్‌ మేయర్‌ విజ్ఞప్తి చేశారు. లాస్‌ ఏంజిలెస్‌ ప్రాంతంలో గత 150 ఏళ్లలో నమోదైన తొలి ఐదు అత్యధిక వర్షపాతాల్లో ఇది ఒకటని తెలిపారు. మరోవైపుఇదే తుఫాను లాస్‌వేగాస్‌, నెవాడ ప్రాంతాల్లో భారీ హిమపాతానికి కారణమైంది. లీ కెనైన్‌ స్కీ రిసార్ట్‌ వద్ద మంచు పెళ్లలు విరిగిపడ్డాయి. మమ్మూత్‌ స్కీబేస్‌లో 33 అంగుళాల హిమపాతం నమోదైంది. కాలిఫోర్నియా, అరిజోనా, నెవాడాల్లో ప్రస్తుతం 3 కోట్ల మంది ప్రజలు వరద ముప్పులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు

Tags

Read MoreRead Less
Next Story