RUSSIA: నింగిలోకి దూసుకెళ్లిన రష్యా రాకెట్‌

RUSSIA: నింగిలోకి దూసుకెళ్లిన రష్యా రాకెట్‌
50 ఏళ్ల తర్వాత జాబిల్లిపైకి రష్యా లూనా-25 రాకెట్‌... ఏడు రోజుల్లోనే చంద్రుడిపై దిగనున్న ల్యాండర్‌

ఐదు దశాబ్దాల తర్వాత చంద్రుడిపైకి రష్యా (Russia) రాకెట్‌ దూసుకెళ్లింది. జాబిల్లి దక్షిణ ధ్రువంలో(Moon's south pole position) ల్యాండర్‌ను దించడమే లక్ష్యంగా లునా - 25‍ (Russia's Luna-25‌) జాబిల్లి దిశగా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ చిత్రాలను రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్‌కాస్మోస్‌(Russia's space agency Roscosmos ) విడుదల చేసింది. మాస్కోకు తూర్పున 3 వేల 450 మైళ్ల దూరంలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్‌ అనే ప్రాంతం నుంచి తెల్లవారుజామున 2.10 గంటలకు ‘లునా - 25’ నింగిలోకి దూసుకెళ్లింది.కేవలం ఐదు రోజుల్లోనే లూనా 25 చంద్రుడి కక్ష్యలోకి చేరనుంది. ఆ తర్వాత జాబిల్లిపై ఎవరూ చేరని దక్షిణ ధ్రువంలో మరో 3 లేదా 7 రోజుల్లో ల్యాండర్‌ను దిగేలా మాస్కో ఈ ప్రయోగం చేపట్టింది. అన్ని అనుకూలంగా జరిగితే ఆగస్టు 21వ తేదీన ఈ ల్యాండర్‌ చంద్రుడిపై అడుగుపెట్టనున్నట్లు రోస్‌కాస్మోస్‌ ప్రకటించింది.


ఇస్రో నిర్ణయించుకున్న ఆగస్టు 23 తేదీ లేదా అంతకంటే ముందుగానే చంద్రుని దక్షిణ ధ్రువంపై రష్యా ల్యాండర్‌ను దించేందుకు రష్యా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌-3కి మాత్రం జాబిల్లిపై దిగేందుకు 41 రోజుల సమయం పడుతోంది. ఇప్పటివరకు ఏ అంతరిక్ష నౌకా చేరని జాబిల్లి దక్షిణ ధ్రువంలో గణనీయమైన పరిమాణంలో మంచు ఉంటుందనీ భావిస్తున్న శాస్త్రవేత్తలు అక్కడ ల్యాండింగ్ సవ్యంగా జరిగితే. ఆక్సిజన్‌, ఇంధనం, నీరు వంటి వనరులపై సమాచారం సేకరించవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో రష్యా పంపనున్న లూనా-25 దక్షిణ ధ్రువంపై ఆగస్టు 23 లేదా అంతకన్నా ముందే దిగితే అక్కడ అడుగుపెట్టిన తొలిదేశంగా రష్యా చరిత్ర సృష్టిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


చంద్రయాన్-3(Chandrayaan-3) ఆగస్టు 23 సాయంత్రం 5 గం టల 47 నిమిషాలకు చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయనున్నట్లు ఇస్రో ఇప్పటికే ప్రకటించింది. చంద్రయాన్‌-3 మాదిరి కాకుండా ఇది కేవలం ల్యాండర్‌ మిషన్‌ మాత్రమే. కేవలం 30 కేజీల పేలోడ్‌ను మోసుకెళ్తోంది. ఇందులో చంద్రుడిపై మట్టి ఆనవాళ్లను సేకరించేందుకు అవసరమయ్యే రోబోటిక్‌ చేతులు, డ్రిల్లింగ్‌ హార్డ్‌వేర్‌తో పాటు ఇతర శాస్త్రీయ పరికరాలు ఉన్నాయి.


రష్యా, భారత్‌ ల్యాండర్‌లు రెండు ఒకేసారి చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్‌ కావడం వల్ల పరస్పరం ఢీకొనే ప్రమాదం ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే దీనిపై రష్యా స్పష్టతనిచ్చింది. రెండు దేశాల అంతరిక్ష పరిశోధనా సంస్థలు ల్యాండింగ్ చేయాలనుకున్న ప్రాంతాలు వేరని తెలిపింది. అంతేకాకుండా ల్యాండింగ్ క్రమంలో చంద్రయాన్-3, లూనా-25 పరస్పరం ఢీకొనే ప్రమాదం లేదని వివరించింది. చంద్రుడిపై ల్యాండింగ్‌కు సరిపడా ప్రాంతాలున్నాయని రష్యా పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story