Chess World Cup 2023 Final : విజేతగా మాగ్న‌స్ కార్ల్‌సన్‌..

Chess World Cup 2023 Final : విజేతగా మాగ్న‌స్ కార్ల్‌సన్‌..
పోరాడి ఓడిన ప్రజ్ఞానంద

ఫిడే చెస్‌ ప్రపంచకప్‌ విజేత‌గా నార్వేకు చెందిన ప్ర‌పంచ నంబ‌ర్ వ‌న్ ఆట‌గాడు మాగ్నస్‌ కార్ల్‌సన్ నిలిచాడు. ప్రపంచకప్ ఫైనల్లో భారత సంచలన గ్రాండ్ మాస్టర్ 18 ఏళ్ల ప్రజ్ఞానంద ఓటమిపాలయ్యాడు. ట్రై బ్రేక్‌లో భాగంగా హోరాహోరీ జ‌రిగిన తొలి రౌండ్ గేమ్‌లో క్లార్‌స‌న్ దూకుడు ప్ర‌ద‌ర్శించాడు. త‌న అనుభ‌వాన్ని ఉప‌యోగించుకుంటూ విజ‌యం సాధించాడు.

అజర్ బైజాన్ లోని బాకు నగరంలో ఈ మెగా ఈవెంట్ జరుగుతోంది. కార్ల్ సన్, ప్రజ్ఞానంద మధ్య ఫైనల్లో రెండు క్లాసికల్ గేమ్ లు డ్రాగా ముగియడంతో, టై బ్రేక్ లో భాగంగా ఇవాళ ర్యాపిడ్ రౌండ్ నిర్వహించారు. తొలిగేమ్ లో కార్ల్ సన్ గెలవగా, రెండో గేమ్ డ్రాగా ముగిసింది. రెండో గేమ్ లో ప్రజ్ఞానంద గెలిచి ఉంటే, ఈ పోరు బ్లిట్జ్ రౌండ్ కు దారితీసేది. కానీ, రెండో గేమ్ ను ప్రజ్ఞానంద డ్రా చేసుకోవడంతో కార్ల్ సన్ ప్రపంచకప్ విజేతగా అవతరించాడు. విజేత‌గా నిలిచిన కార్ల్‌స‌న్‌కు రూ.91 ల‌క్ష‌లు, ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన ప్ర‌జ్ఞానంద‌కు రూ.61 ల‌క్ష‌లు ప్రైజ్‌మ‌నీ ద‌క్కింది.

ఇప్పటికే ఐదు పర్యాయాలు వరల్డ్ చెస్ చాంపియన్ షిప్ టైటిళ్లు సాధించిన 30 ఏళ్ల నార్వే గ్రాండ్ మాస్టర్ కార్ల్ సన్ కు కెరీర్ లో ఇదే తొలి ఫిడే వరల్డ్ కప్ టైటిల్. అటు, గతంలో పలుమార్లు కార్ల్ సన్ ను ఆన్ లైన్ చెస్ లో ఓడించిన ప్రజ్ఞానంద... ప్రపంచకప్ సమరంలో ముఖాముఖి పోరులో ఓడించిలేకపోయాడు. తద్వారా, వరల్డ్ కప్ నెగ్గాలన్న కలను నెరవేర్చుకోలేకపోయాడు.

ఫిడే ప్రపంచకప్‌ రన్నరప్‌గా నిలిచినప్పటికీ ప్రజ్ఞానందపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఫైనల్లో టైబ్రేక్‌ ఓడిన ప్రజ్ఞానందకు దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు. 'టోర్నమెంట్‌లో అద్భుతంగా ఆడినందుకు అభినందనలు. నీ కలల్ని నిజం చేసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉండు. దేశం గర్వపడేలా చేశావు' అని పేర్కొన్నాడు.

Tags

Read MoreRead Less
Next Story