Coronavirus In China : కరోనాతో విలవిలలాడుతున్న చైనా.. రికార్డు స్థాయిలో కేసులు

Coronavirus In China : కరోనాతో విలవిలలాడుతున్న చైనా.. రికార్డు స్థాయిలో కేసులు
Coronavirus In China : చైనాను కరోనా భయభ్రాంతులకు గురిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఆంక్షలు సడలిస్తోన్నా.... చైనాలో మాత్రం వైరస్‌ ఉద్ధృతి పెరుగుతోంది.

Coronavirus In China : చైనాను కరోనా భయభ్రాంతులకు గురిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఆంక్షలు సడలిస్తోన్నా.... చైనాలో మాత్రం వైరస్‌ ఉద్ధృతి పెరుగుతోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత రెండేళ్లలో ఎన్నడూ లేనంతగా 16 వేల 400 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఇందులో 13వేల కేసులు ఆర్థిక రాజధాని షాంఘైలోనే నమోదయ్యాయి. తొమ్మిది రోజుల క్రితం లాక్‌డౌన్‌ విధించినప్పటితో పోలిస్తే.. తాజా కేసుల సంఖ్య మూడు రెట్లు అధికంగా పెరిగింది.

షాంఘైలో లాక్‌డౌన్‌ విధించి భారీస్థాయిలో పరీక్షలు నిర్వహిస్తుండటంతో కొత్త కేసులు అంతే స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో లాక్‌డౌన్‌ను మరింతకాలం పొడిగిస్తున్నట్లు తెలిపారు అధికారులు. షాంఘైలో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. దాదాపు 2.5 కోట్ల మంది లాక్‌డౌన్‌లో ఉన్నారు. వైరస్ ఉద్ధృతి తగ్గేవరకు లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగనున్నాయి. గ్వాంగ్‌డాంగ్, జిలిన్, షాన్‌డాంగ్ వంటి భారీ జనాభా గల ప్రావిన్సుల్లో 390 ప్రాంతాలను సాధారణ లేదా హై రిస్క్ ప్రాంతాలుగా ప్రకటించారు.

ఇప్పటికే షాంఘైలోని కొన్ని ప్రాంతాల్లో కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఇంటి బయటకు రావడానికి కూడా వీల్లేదు. దీంతో ఇక్కడి వారు ఆహారం, తాగునీటిని కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసి తెప్పించుకొంటున్నారు. కొన్ని రకాల ఆహార పదార్థాలు అసలు ఆన్‌లైన్‌లోనే ఉండకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

మరోవైపు కరోనా ఉద్ధృతిని అడ్డుకునేందుకు సైన్యాన్ని రంగంలోకి దించారు. 2,000 మంది సైనిక వైద్య సిబ్బంది సహా పదివేల మంది ఆరోగ్య కార్యకర్తలు షాంఘై చేరుకున్నారు. చాలా కర్మాగారాలు, ఆర్థిక సంస్థలు తమ ఉద్యోగులను వేరుగా ఉంచుతూ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. లాక్‌డౌన్‌ పొడిగింపు కారణంగా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాలు పడొచ్చనే ఆందోళనలు పెరుగుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story