China- Pakistan : సిపెక్ సాక్షిగా దోస్త్ మేరా దోస్త్

China- Pakistan  : సిపెక్ సాక్షిగా దోస్త్ మేరా దోస్త్
10 ఏళ్ళు పూర్తి చేసుకున్న చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్

పాకిస్థాన్ తో తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రకటించారు. చైనా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్‌) ప్రాజెక్ట్ ఉభయ దేశాల మధ్య పెనవేసుకున్న గాఢమైన స్నేహానికి ప్రతీక అని జిన్‌పింగ్ అభివర్ణించారు. చైనా ఎల్లప్పుడూ పాకిస్థాన్‌కు అండగా దృఢంగా ఉంటుందని స్పష్టం చేశారు. సిపిఇసి ఇన్‌ఫ్రాస్టక్చర్ ప్రాజెక్టులు చేపట్టి పదేళ్లు పూర్తయిన సందర్భంగా పదవ వార్షికోత్సవాన్ని ఇస్లామాబాద్‌లో సోమవారం నిర్వహించిన సందర్భంగా జిన్‌పింగ్ అభినందన సందేశాన్ని అందజేశారు.


చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సిపిఇసి ) బిలియన్ డాలర్ల విలువ చేసే సిపిఇసి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్. ఇది ప్రారంభం అయ్యి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2013లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు మాత్రమే కాకుండా, చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్‌ఐ)కి కూడా ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. పాకిస్థాన్ బెలోచిస్థాన్ లోని గ్వాడర్ పోర్టుతో చైనా లోని జింజియాంగ్ ప్రావిన్స్‌తో అనుసంధానం అయ్యే సిపిఇసి ప్రాజెక్టును భారత్ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా ఈ ప్రాజెక్టు నిర్మాణమవుతోంది. ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి చైనా వైస్ ప్రీమియర్ హెలిఫెంగ్ హాజరయ్యారు. ఆయన పాకిస్థాన్‌లో మూడు రోజుల పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా జిన్ పింగ్ ప్రత్యేక ప్రతినిధిగా హీ లిఫింగ్ జిన్ పింగ్ సందేశాన్ని చదివి వినిపించారు

60 బిలియన్ డాల ర్లతో నిర్మిస్తున్న సీపెక్ ....బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టులో అత్యంత కీలకమైనదని వ్యాఖ్యానించారు. 2013 నుంచి సీపెక్ ద్వారా ఇరు దేశాలు అనేక ప్రయోజనాలు పొందాయని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా పాకిస్థాన్ సామాజికంగా, ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని జిన్ పింగ్ తెలిపారు. సీపెక్ ప్రాంతీయ అనుసంధాన్ని పెంచిందని చెప్పారు. అంతర్జాతీయంగా ఎన్ని మార్పులు వచ్చినా పాకిస్థాన్ కు అండగా నిలుస్తామని జిన్ పింగ్ పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్ట్ కింద చైనా.. పాకిస్తాన్‌లో పది బిలియన్ల డాలర్లను పెట్టుబడి పెట్టింది. దీనిలో భాగంగా భారీ రవాణా, ఇంధనం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అమలు చేసింది.

Tags

Read MoreRead Less
Next Story