China : చైనా హైపవర్‌ మైక్రోవేవ్‌ ఆయుధం

China : చైనా హైపవర్‌ మైక్రోవేవ్‌ ఆయుధం
డ్రోన్లు, యుద్ధ విమానాలను ధ్వంసం చేసే వెపన్

కదిలే ట్రక్కు నుంచి సైతం ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఉపయోగించగలిగే అత్యంత శక్తిమంతమైన మైక్రోవేవ్‌ (హెచ్‌పీఎం) ఆయుధాన్ని చైనా శాస్త్రజ్ఞులు తయారుచేయగలిగారు. ఈ తరహా ఆయుధాల తయారీలో ఎదురయ్యే అత్యధిక ఉష్ణోగ్రత సమస్యను ‘స్టిర్లింగ్‌ ఇంజన్‌’ల సాయంతో వారు అధిగమించారు. మైక్రోవేవ్‌ వెపన్స్‌ను వినియోగించడానికి సాధారణంగా అయ్యే శక్తిలో ఐదు వంతు శక్తి చాలు దీన్ని వాడడానికి. థర్మల్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చడానికి నాలుగు కాంపాక్ట్ స్టిర్లింగ్ ఇంజిన్‌లను ఉపయోగించారని, ఇది డ్రోన్‌లు, యుద్ధ విమానాలు, ఉపగ్రహాలను తటస్థీకరించగల శక్తివంతమైన తరంగాలను విడుదల చేస్తుందని ఇటువంటి అద్భుతాన్ని చైనా శాస్త్రవేత్తలు తయారుచేసినట్టు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది.


నిరంతరాయంగా నాలుగు గంటలపాటు దాన్ని వినియోగించవచ్చని దాని రూపకర్తలు చెబుతున్నారు. అలాగే.. ప్రపంచంలోనే స్టిర్లింగ్‌ ఇంజన్‌ టెక్నాలజీతో పనిచేసే తొలి హెచ్‌పీఎం ఆయుధం ఇది. ఇంతకీ ఏమిటీ మైక్రోవేవ్‌ ఆయుధం? అంటే.. గత ఏడాది అక్టోబరులో హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌ సరిహద్దులోని వాచ్‌టవర్లపైన, సెక్యూరిటీ కెమెరాలపైన పెద్ద సంఖ్యలో డ్రోన్‌లతో దాడులు చేశారు గుర్తుందా? వాచ్‌టవర్లు కూలిపోయి, సెక్యూరిటీ కెమెరాలు ధ్వంసం కావడంతో అసలేం జరుగుతోందో తెలుసుకోవడానికే ఇజ్రాయెల్‌ సేనలకు చాలా సమయం పట్టింది. ఈలోగా ఉగ్రవాదులు సరిహద్దులు దాటొచ్చి నరమేధం సాగించారు. ఇలాంటి డ్రోన్ల గుంపులను సమర్థంగా ఎదుర్కొని నాశనం చేసే సత్తా కలిగిన ఆయుధాలు.. హైపవర్‌ మైక్రోవేవ్‌ వెపన్స్‌. ఇలాంటి డ్రోన్లు పెద్ద సంఖ్యలో దూసుకొచ్చినప్పుడు.. శక్తిమంతమైన విద్యుదయస్కాంత తరంగాలను వాటిపైకి ప్రసరింపజేయడం ద్వారా వాటిలోని ఎలకా్ట్రనిక్‌ వ్యవస్థలు పనికిరాకుండా చేస్తాయి. దీంతో ఆ డ్రోన్లు వాటంతట అవే కింద పడి పాడైపోతాయి. ఇలాంటి ఆయుధాలను అమెరికా, చైనా, రష్యా సహా పలు దేశాలు ఈ ఆయుధాలను చాలాకాలంగా అభివృద్ధి చేస్తున్నాయి. అయితే చైనా ప్రస్తుతం తయారుచేసినట్టు చెబుతున్నది డ్రోన్లనే కాక.. శత్రువుల యుద్ధవిమానాలను, ఉపగ్రహాలను సైతం నిర్వీర్యం చేయగలదని చెబుతున్నారు. అయితే.. యుద్ధరంగంలో దాన్ని ఉపయోగించడానికి ఇంకా కొంత సమయం పడుతుందని రూపకర్తలు పేర్కొన్నారు.


ఇందులో మరో అద్భుతం ఏంటంటే సాధారణంగా హైపవర్‌ మైక్రోవేవ్‌ ఆయుధాలు పరిమాణంలో చాలా పెద్దగా ఉంటాయి. వాటిని పనిచేయించడానికి చాలా ఎక్కువ శక్తి కావాలి. అందుకు భారీగా ఖర్చవుతుంది. కానీ, తాము అభివృద్ధి చేసిన వెపన్‌కు అంత శక్తి అవసరం లేదని.. పైగా దాన్ని సులభంగా ఒక ట్రక్కులో పెట్టి ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లి ఉపయోగించవచ్చని, ప్రయాణంలో కూడా ఉపయోగించవచ్చని చైనా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story