China : గ్రేట్ వాల్ అఫ్ చైనాకి కన్నం పెట్టిన జంట

China : గ్రేట్ వాల్ అఫ్ చైనాకి కన్నం పెట్టిన జంట
తమ పని చేసే ప్రదేశానికి వెళ్ళడానికి షార్ట్ కట్ కోసం..

రోడ్లపై వెళ్లేటప్పుడు షార్ట్‌కట్‌ కోసమని మనం రాంగ్ రూట్ లో వెళతాం.. లేకపోతే డివైడర్ల దగ్గర ఎక్కడ ఖాళీ దొరుకుతుందా బైక్ తిప్పేద్దామా అని చూస్తాం. కొంచం దూరమే కదా అని ట్రాఫిక్ పోలీస్ కళ్లు గప్పి అటో ఇటో వెళ్ళిపోతాం.. కొన్నిసార్లు డివైడర్లను మార్చేసి షార్ట్‌కట్‌లు క్రియేట్‌ చేసే ఘనులు చాలామందే ఉంటారు. అయితే ఈ జంట రూటే సెపరేట్.. మాములు వాళ్ళకంటే వీళ్ళు నాలుగు ఆకులు ఎక్కువే చదివారు. తొందరగా వెళ్లేందుకు ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచిన చారిత్రక కట్టడానికే కన్నం పెట్టేసారు.తమ వాహనాలు వెళ్లేందుకు కావాల్సినంత వెడల్పుగా గోడను తవ్వేశారు. చైనాలోని ఉత్తర షాక్సి ప్రావిన్స్‌లోని యుయు కౌంటీ వద్ద యాంగ్‌కాన్హె టౌన్‌షిప్‌ వద్ద జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.


యుయు కౌంటీ వద్ద ఉన్న గ్రేట్‌వాల్‌ ఆఫ్‌ చైనాను 32 గ్రేట్‌వాల్‌ అని పిలుస్తుంటారు. దీనికి సమీపంలో ఓ కన్‌స్ట్రక్షన్‌కు సంబంధించిన కాంట్రాక్టును ఇద్దరు వ్యక్తులు తీసుకున్నారు. వారిలో 38 ఏళ్ల వ్యక్తి, 55 ఏళ్ల మహిళ ఉన్నారు. అయితే వారు ఉండే ప్రదేశానికి, కాంట్రాక్ట్‌ తీసుకున్న ప్రదేశానికి మధ్యలో 32 గ్రేట్‌వాల్‌ ఉంటుంది. దీంతో చాలా కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. రోజూ యంత్రాలను, సామగ్రిని తీసుకుని అంత దూరం తిరిగి వెళ్తుంటే బోలెడంత సమయం, చాలా డబ్బులు ఖర్చవుతున్నాయని వాళ్లు భావించారు. ఇంకేముంది అడ్డుగా ఉన్న గ్రేట్‌వాల్‌ను కాస్త కూల్చేస్తే ప్లాన్ వేశారు. గ్రేట్‌వాల్‌కు ఉన్న చిన్న సందుని గమనించి దాన్ని మొత్తం తవ్వేశారు. తమ వాహనాలు వెళ్లేందుకు కావాల్సినంత వెడల్పుగా గోడను తవ్వేశారు. తమకు అనుకూలంగా ఒక షార్ట్‌కట్‌ను క్రియేట్‌ చేసుకున్నారు. ఎంచక్కా ఆ షార్ట్‌కట్‌లో రాకపోకలు సాగిస్తున్నారు. ఇది గమనించిన స్థానికులు ఆగస్టు 24వ తేదీన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.


చైనా సమగ్రతకు, ప్రతిష్టకు ప్రతీకగా నిలిచే చారిత్రాత్మకమైన గోడను కూల్చేయడం చూసి అధికారులు కూడా షాక్ అయ్యారు. కేవలం షార్ట్‌కట్‌గా ఉపయోగపడుతుందని ప్రపంచ ఏడు వింతల్లో ఒకటిగా నిలిచిన కట్టడం కూల్చేయడమేంటని సీరియస్‌ అయ్యారు. నిందితులు ఇద్దరిపై కేసు నమోదు చేసి ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా నిర్మాణాన్ని క్రీ.పూ.200 సంవత్సరంలో మింగ్‌ వంశస్తులు ప్రారంభించారు. అయితే క్రీ.శ.1600 వచ్చేసరికి దీని నిర్మాణం పూర్తయ్యిందని చరిత్రకారులు చెబుతున్నారు. ప్రపంచంలోనే అతి పొడవైన ఈ గోడను 1987లో యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించింది. అయితే అలాంటి గొప్ప నిర్మానానికి వీరిద్దరూ కొన్ని రోజుల్లో కన్నం పెట్టేశారు

Tags

Read MoreRead Less
Next Story