US-China: జో బైడెన్ తో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భేటీ

US-China: జో బైడెన్ తో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భేటీ
ఆరేళ్ల తర్వాత తొలిసారి అగ్రరాజ్యంలో

డ్రాగన్ కంట్రీ అధినేత జిన్ పింగ్ చాలా ఏళ్ల తర్వాత అమెరికా పర్యటనకు వెళ్లారు. శాన్‌ఫ్రాన్సిస్కో వేదికగా ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక సహకార మండలి శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సదస్సుకు యూఎస్‌ ప్రెసిడెంట్‌ జో బైడెన్‌ ఆహ్వానం మేరకు జిన్‌పింగ్‌ అగ్రరాజ్యం వెళ్లారు. జిన్‌పింగ్‌కు అమెరికా మంత్రులు, ఉన్నతాధికారులు సైనిక లాంఛనాలతో గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. ఇక, అమెరికా- చైనా దేశాల మధ్య సంబంధాలు పతనం అవుతున్న వేళ జిన్‌పింగ్‌ అమెరికా పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. మంగళవారం సాయంత్రం ఆయన శాన్‌ఫ్రాన్సిస్కోలో అడుగుపెట్టారు. జిన్‌పింగ్‌ సుమారు ఆరేళ్ల తర్వాత అమెరికా పర్యటకు వెళ్లడం ఇదే మొదటి సారి. చివరిసారిగా ఆయన 2017లో అగ్రరాజ్యంలో పర్యటించారు.


శాన్‌ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక సహకార సదస్సుకు జో బైడెన్‌ ఆహ్వానం మేరకు జిన్‌పింగ్‌ వెళ్లారు. ఈ సమావేశం తర్వాత కాలిఫోర్నియాలో అమెరికా అధినేత జో బైడెన్‌- చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్‌ భేటీ కానున్నారు. ఇరు దేశాల మధ్య ద్వై పాక్షిక సంబంధాలు, వాణిజ్యం, తైవాన్‌ అంశాలతో పాటు రెండు దేశాల మధ్య కొనసాగుతున్న వివాదాలపై ఈ ఇద్దరు చర్చించనున్నట్లు తెలుస్తుంది.. అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు, మరోవైపు ఇజ్రాయెల్-హమాస్‌ పోరు నేపథ్యంలో బైడెన్‌, జిన్‌పింగ్‌ భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకున్నది. అయితే వీరి భేటీలో ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం అంశం చర్చకు వస్తుందా..? లేదా..? అనే విషయంలో వైట్‌హౌస్‌ స్పష్టత ఇవ్వలేదు. కాగా, ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అమెరికా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నది. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతానికి.. అపోహలను తొలగించుకునేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని అమెరికా- చైనా దేశాలు భావిస్తున్నాయి.

మరోవైపు డ్రాగన్‌ దేశం చైనా పాలస్తీనీయులకు మద్దతుగా వ్యాఖ్యలు చేసింది. ఇజ్రాయెల్‌కు తమ దేశాన్ని రక్షించుకునే హక్కు ఉందని, అయితే అది అంతర్జాతీయ మానవతా చట్టాల పరిధికి లోబడి మాత్రమే ఉండాలని చైనా సూచించింది. అంతేగాక పాలస్తీనాను స్వతంత్ర దేశంగా మార్చడమే ఈ యుద్ధానికి ఏకైక పరిష్కారమని ఇటీవల డ్రాగన్‌ పునరుద్ఘాటించింది.

Tags

Read MoreRead Less
Next Story