CHINA: పెళ్లంటే భయపడిపోతున్న చైనా యువత

CHINA: పెళ్లంటే భయపడిపోతున్న చైనా యువత
చైనాలో పెరుగుతున్న గృహ హింస కేసులు... పెళ్లే వద్దంటున్న యువత.. బతిమాలుతున్న ప్రభుత్వం

వద్దురా సోదరా పెళ్ళంటె నూరేళ్ళ మంటరా.. పాటను చైనా యువత ఇప్పుడు వాళ్ల భాషలో పాడుకుంటున్నారు. ఇంట్లో వాళ్లు పెళ్లి చేసుకోమన్నా... వివాహం చేసుకోమని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నా డ్రాగన్‌ యూత్‌ అస్సలు పట్టించుకోవట్లేదు.పెళ్లి మాట ఎత్తితే చాలు యువత భయపడిపోతోంది. ఒకప్పుడు ఒక బిడ్డ కంటే ఎక్కువ మందిని కంటే చైనా సర్కార్‌ శిక్షించేది. ఇప్పుడు బిడ్డల్ని కంటే బహుమతులిస్తామని వేడుకుంటున్నా యువత మాత్రం అసలు పెళ్లే చేసుకోబోమని అంటోంది. దీనికి ఆ దేశంలో పెరుగుతున్న గృహ హింస కేసులు కూడా కారణమని ఓ నివేదిక స్పష్టం చేసింది. చైనాలో గృహ హింస కేసులో గతంలో పోలిస్తే రెట్టింపయ్యాయని వెల్లడించింది.

చైనాలో పెరుగుతున్న గృహ హింస కేసుల సంఖ్య యువత పెళ్లిళ్లపై ప్రభావాన్ని చూపుతోందని ఓ వార్తా సంస్థ వెల్లడించింది. ఇటీవల జరిగిన రెండు గృహ హింస హత్యలు దానిని ధ్రువపరుస్తున్నాయని వెల్లడించింది. తూర్పు ప్రావిన్స్ షాన్‌డాంగ్‌లో ఇటీవల ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. పట్టపగలు జరిగిన ఈ హత్య చైనా సోషల్‌మీడియా వీబోను కుదిపేసింది. ఒక వ్యక్తి తన భార్యపై పదే పదే కారు ఎక్కించి హత్య చేశాడు. దాడి మధ్యలో కారు దిగి ఆమె బతికి ఉందో లేదో అని చూసి... చనిపోయేంత వరకు అలా కారు ఎక్కిస్తూనే ఉన్నారు. దాడిలో ప్రదర్శించిన క్రూరత్వం చూసి చైనా యువత భయాందోళనలకు గురైంది. దాదాపు 300 మిలియన్ల మంది ఈ వీడియోను చూశారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ఇలాంటివే మరో రెండు గృహ హింస కేసులు చైనాను కుదిపేశాయి. ఈ ఏడాది జూన్‌లో గ్వాంగ్‌డాంగ్‌లో ఒక వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి చంపాడు. భార్య చాలా సంవత్సరాలుగా గృహ హింసకు గురైందని.. ఆమె విడాకుల కోసం ప్రయత్నిస్తుండగా ఆ వ్యక్తి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ఇలా గృహ హింస కేసులు పెరుగుతుండడంతో పెళ్లి చేసుకోవడానికి చైనా యువత వెనకడుగు వేస్తోందని అంతర్జాతీయ నివేదిక స్పష్టం చేసింది.

చైనా పౌర సంబంధాల వ్యవహారాల మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2021తో పోలిస్తే.. 2022లో వివాహం చేసుకునే వారి సంఖ్య 10.5 శాతం తగ్గిపోయింది. 2021లో 7.63 మిలియన్ల జంటలు వివాహం చేసుకోగా, 2022లో 6.8మిలియన్ల జంటలు పెళ్లిళ్లు చేసుకున్నట్లు తెలిపింది. గత కొన్నేళ్లుగా చైనాలో జననాల రేటు తగ్గిపోతుండటంతో ఆందోళన వ్యక్తం చేసిన ప్రభుత్వం.. పెళ్లిళ్లు చేసుకునేవారికి, పిల్లలు కనేవారికి రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రకటించింది. అయినా చైనాలో వివాహాలు చేసుకునేందుకు యువత ముందుకు రావట్లేదు.

Tags

Read MoreRead Less
Next Story