అమెరికాలో రికార్డుస్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు

అమెరికాలో రికార్డుస్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు

అమెరికాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నవంబర్ నెలలోనే 10 లక్షలకు పైగా కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నందున హాస్పిటళ్లు రోగులతో కిటకిటలాడుతున్నాయి. 44 రాష్ట్రాల్లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. ఇదే విధంగా కేసులు పెరిగితే మరణాలూ భారీగా పెరగొచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అగ్రరాజ్యంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య..కోటి 2 లక్షలు దాటింది. మొత్తం కరోనా మరణాల సంఖ్య.. 2 లక్షల 40 వేలకు చేరింది. సెకండ్ వేవ్ తీవ్రంగా మారితే.. రానున్న రెండు నెలల్లో మరో లక్ష మందికిపైగా చనిపోయే అవకాశం ఉందని వాషింగ్టన్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 61 వేల 694 మంది చికిత్స పొందుతున్నారు. రోజుకు సగటున 16 వందల 61 మంది హాస్పిటల్‌లో చేరుతున్నారు.

అమెరికాలో కొవిడ్‌ విజృంభణపై ఆ దేశ అంటువ్యాధుల నివారణ నిపుణుడు డాక్టర్‌ ఆంటోనీ ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మహమ్మారిని తీవ్రంగా పరిగణించాలని సూచించారు. కొంతకాలం ఎక్కడి వారు అక్కడే ఉండి.. తమ పనుల్ని చేసుకోవాలని చెప్పారు. మరికొన్ని రోజుల్లో వ్యాక్సిన్‌ రాబోతోందని అన్నారు. సామాజిక దూరం పాటించడం, మాస్క్‌ ధరించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం, గుమిగూడకుండా ఉండడం వంటి నియమాలు పాటించాలని చెప్పారు.



Tags

Read MoreRead Less
Next Story