Luna-25: చంద్రుడిపై కూలిపోయిన చోట గొయ్యి

Luna-25: చంద్రుడిపై కూలిపోయిన చోట గొయ్యి
ఫొటోలు విడుదల చేసిన నాసా

దాదాపుగా 40 ఏళ్ల తరువాత రష్యా లూనా-25 అంతరిక్ష నౌకను చంద్రుడిపైకి పంపింది. అన్ని అనుకున్నట్లు జరిగిే చంద్రయాన్-3 కన్నా ముందే లూనా-25 చంద్రుడి దక్షిణ ధృవంపై దిగి చరిత్ర సృష్టించేది. అయితే చంద్రుడి ఉపరితలంపై దిగే క్రమంలో రష్యా అంతరిక్ష నౌక లూనా 25 ఇంజన్ వైఫల్యం ఎదుర్కోంది. ల్యాండింగ్ పాయింట్ కు ఇంకా కాస్త దూరంగానే లూనా-25 విఫలమైంది.

అసలు చంద్రుడి కక్ష్యలోకి చేరిన తర్వాత లూనా-25 రష్యాతో సంబంధాలు కోల్పోయింది. అయితే ఇందుకు గల కారణాలను విశ్లేషిస్తోంది రష్యా అంతరిక్ష సంస్థ. ఇందులో భాగంగా లూనా-25 కుప్పకూలిన ప్రాంతాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా గుర్తించింది. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా విడుదల చేసింది. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా లూనా-25లోని ఇంజన్లు పనిచేయలేక పోవడం వల్లే క్రాష్ జరిగినట్లు ప్రాథమిక సమాచారం.


అయితే తాజాగా లూనా 25 కూలిన ప్రాంతంలో ఆ స్పేస్‌క్రాఫ్ట్ ధాటికి సుమారు 10 మీట‌ర్ల విస్తీర్ణంలో గొయ్యి ఏర్పడిన‌ట్లు నాసా వెల్ల‌డించింది. నిజానికి లూనా 25, చంద్రుడిపై బోగుస్లావ్‌స్కీ బిలం సమీపంలో చంద్ర దక్షిణ ధ్రువం దగ్గర దిగాలని ప్లాన్ చేసి విఫలమైంది. ఆ ప్రయోగం తర్వాత ఈ ప్రాంతాన్ని గుర్తించిన నాసా తాజాగా లూనా-25 కూలిన ప్రాంతంలో ఏర్ప‌డిన అగాధం గురించి నాసాకు చెందిన లూనార్ రిక‌న్నైసెన్స్ ఆర్బిటార్ ఫోటోల‌ను రిలీజ్ చేసింది. ఈ బిలం లూనా ఇంపాక్ట్ పాయింట్ కు దగ్గర ఉందని, ఇది సహజమైన తాకిడిగా లేదని, ఇది కూలిపోవడం వల్లే ఏర్పడినట్లు నిర్థారించింది.


మ‌రో వైపు లూనా-25 విఫ‌ల‌మైన అంశంపై ద‌ర్యాప్తు చేప‌ట్టేందుకు ర‌ష్యా ప్ర‌త్యేక క‌మీష‌న్ ఏర్పాటు చేసింది. క్రాష్ కు గల కారణాలను పరిశోధించడానికి ప్రత్యేక ఇంటర్-డిపార్ట్‌మెంటల్ కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు రష్యా తెలిపింది.

మరోవైపు ఇస్రో పంపిన చంద్రయాన్‌-3 ఆగస్ట్‌ 23న చంద్రుడిపై సక్సెస్ ఫుల్ గా సాఫ్ట్ ల్యాండ్‌ అయింది. చంద్రుడిపై ల్యాండర్‌ దిగిన తర్వాత బయటకు వచ్చి చంద్రుడిని ముద్దాడిన రోవర్‌ అనేక కీలక విషయాలు వెలుగులోకి తీసుకొచ్చింది. చంద్రుడిపై ఆక్సిజన్‌ నిల్వలు ఉన్నట్లు తెలిపింది. అంతే కాకుండా భూమిపై సంభవించే ప్రకంపనల లాగానే చంద్రుడిపై కూడా ప్రకంపనలు కలుగుతాయని తేలినట్లు ఇస్రో తెలిపింది.

దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేసిన తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయి. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల 4నిమిషాలకు జాబిల్లి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన చంద్రయాన్‌-3 మునుపెన్నడూ తెలియని జాబిల్లి విషయాలను ప్రపంచంతో పంచుకుంటోంది.

Tags

Read MoreRead Less
Next Story