Dawood Ibrahim : అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం ఆసుపత్రిలో చేరిక

Dawood Ibrahim : అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం ఆసుపత్రిలో చేరిక
పాకిస్థాన్ లోని కరాచీలో చికిత్స ??

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తీవ్ర ఆరోగ్య సమస్యల కారణంగా కరాచీలోని ఆసుపత్రిలో చేరారా అంటే అవునంటున్నాయి పాకిస్థాన్ వర్గాలు. దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్య సమస్యలతో పాకిస్థాన్‌లోని కరాచీలోని ఆసుపత్రిలో చేరినట్లు సోమవారం తెలిపాయి. దావూద్ కు అతని సన్నిహితులే విషప్రయోగం చేశారని, దీంతో అతను అస్వస్థతకు గురయ్యాడని అంటున్నారు. దాహుద్ ఆసుపత్రి పాలయ్యాడని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వార్త ఊహాగానాలు, చర్చలకు దారితీసింది. సోమవారం నాటికి రెండు రోజులుగా దావూద్ కరాచీ నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం. అయితే విషప్రయోగం జరిగినట్లు వచ్చిన వార్తలు నిర్ధారణ కాలేదు.

వ్యవస్థీకృత నేరాల్లో ప్రముఖుడైన దావూద్ ఇబ్రహీం ఏళ్ల తరబడి చట్టానికి దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. 1993 ముంబై పేలుళ్ల ప్రణాళిక, అమలులో అతని ప్రమేయం ఉందని ఆరోపణలలో భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకడిగా ఉన్నాడు. 2008లో 26/11 ముంబై ఉగ్రదాడుల సమయంలో భారత్‌పై యుద్ధం చేసిన 10 మంది పాకిస్తానీ ఉగ్రవాదులకు దావూద్ ఇబ్రహీం దేశ ఆర్థిక రాజధానిలో తన నెట్‌వర్క్ ద్వారా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేసినట్లు భారత ప్రభుత్వం ఆరోపించింది. కరాచీలో దావూద్ ఇబ్రహీం ఉన్నాడని భారత్ సాక్ష్యాధారాలను సమర్పించినప్పటికీ, పాకిస్తాన్ అతనికి తాము ఆశ్రయం ఇవ్వలేదని తిరస్కరిస్తూ వస్తోంది.

ముంబయి పోలీసులు అండర్ వరల్డ్ డాన్ ఆసుపత్రిలో చేరడంపై అతని బంధువులు అలీషా పార్కర్ , సాజిద్ వాగ్లే నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కరాచీలో ఉంటున్నాడని జనవరి నెలలో దావూద్ సోదరి హసీనా పార్కర్ కుమారుడు నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి వెల్లడించారు. కాగా దావూద్ క్షేమంగా ఉన్నాడని, కరాచీలోని అతని సురక్షిత గృహంలో నివసిస్తున్నాడని అతని సన్నిహితులు పేర్కొన్నారు.

దావూద్ సహచరులు, మద్దతుదారులలో భయాందోళనలు, గందరగోళాన్ని సృష్టించడానికి దావూద్ ఆరోగ్యంపై భారతదేశం తప్పుడు పుకార్లను వ్యాప్తి చేసిందని వారు ఆరోపించారు. దావూద్ ఇబ్రహీం ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకడు. ఇతను 250 మందికి పైగా మరణించిన, వేలాది మంది గాయపడిన 1993 ముంబై పేలుళ్లకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దావూద్ మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మనీలాండరింగ్, దోపిడీ,ఆయుధాల స్మగ్లింగ్ వంటి అనేక ఇతర నేర కార్యకలాపాలలో కూడా పాల్గొన్నట్లు భావిస్తున్నారు. దావూద్ తలపై భారతదేశం 25 మిలియన్ డాలర్ల బహుమతిని కూడా ప్రకటించింది.


Tags

Read MoreRead Less
Next Story