Donald Trump: ట్రంప్ అరెస్ట్, బెయిల్

Donald Trump:  ట్రంప్ అరెస్ట్, బెయిల్
జార్జియా రాష్ట్రంలోని ఫుల్టన్ కౌంటీ జైల్ వద్ద లొంగిపోయిన ట్రంప్

ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పోలీసుల ముందు లొంగిపోయారు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసేలా జార్జియా రాష్ట్ర ఫలితాల్ని తారుమారు చేసేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలి మెడకు చుట్టుకోవడంతో ట్రంప్ బుధవారం పోలీసులకు సరెండర్ అయ్యారు. అయితే, రెండు లక్షల డాలర్ల విలువైన బాండ్‌ను సమర్పించి బెయిల్ పొందేందుకు ట్రంప్‌ను అట్లాంటా పుల్టన్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ ఫానీ విల్లిస్ అనుమతించారు. దీంతో, సుమారు అరగంట పాటు జైల్లో ఉన్న ట్రంప్ అధికారిక లాంఛనాలన్నీ పూర్తయ్యాక అక్కడి నుంచి వెళ్లిపోయారు.

జార్జియాలోని ఫుల్టన్ కౌంటీ జైల్ వద్దకు వచ్చిన ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అక్కడ ట్రంప్ శారీరక ప్రమాణాలను జైలు సిబ్బంది నమోదు చేశారు. ట్రంప్ ఎత్తును ఆరు అడుగుల మూడు అంగుళాలు , అతని బరువు 215 పౌండ్లు (97 కిలోగ్రాములు), ఆయన జుట్టు రంగు ‘బ్లాండ్ లేదా స్ట్రాబెర్రీ’గా ఆ జాబితాలో పేర్కొన్నారు. దీంతో అమెరికా చరిత్రలో పోలీసుల రికార్డుల్లో ఒక ఖైదీగా మగ్ షాట్ తీసుకున్న మొదటి అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. ప్రక్రియలన్నీ పూర్తి అయిన తరువాత ఆయన బెయిల్‌పై బయటకొచ్చారు. నిజానికి ఇలాంటి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు తమంతట తాముగా లొంగిపోయినా దాన్ని అరెస్ట్‌‌గానే పరిగణిస్తారు. ఎన్నికలకు సంబంధించిన కేసులోనే ట్రంప్ కొద్ది రోజుల కిందట అరెస్టయిన విషయం తెలిసిందే.

మూడోసారి పోటీకి సిద్ధమవుతోన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. గతంలో అమెరికా క్యాపిటల్ భవనంపై దాడికి తన అనుచరులను ట్రంప్ ఉసిగొల్పినట్టు అభియోగాలు నమోదయ్యాయి. తాజాగా, 2020 అధ్యక్ష ఎన్నికల్లో జార్జియాలో ఫలితాలను తనకు అనుకూలంగా మార్చుకోడానికి ప్రయత్నించినట్లు ఫుల్టన్‌ కౌంటీ గ్రాండ్‌ జ్యూరీ ట్రంప్‌ సహా మొత్తం 18 మందిపై అభియోగాలు నమోదుచేసి దర్యాప్తు చేపట్టింది.

అయితే, ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని, తాను ఏ తప్పు చేయలేదని ట్రంప్‌ వెల్లడించారు. తన అరెస్ట్ అమెరికాకు విషాదకర దినమని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారంటూ ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీ సభ్యులపై మండిపడ్డారు. ఇది న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయడమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story