Donald Trump : ట్రంప్‌కు భారీ షాక్‌, అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అనర్హుడు

Donald Trump :  ట్రంప్‌కు భారీ షాక్‌, అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అనర్హుడు
కొలరాడో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా కాపిటల్ హింస కేసులో కొలరాడో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. కొలరాడో రిపబ్లికన్స్ ప్రైమరీ బ్యాలట్ లో పోటీ చేయకుండా ట్రంప్ పై కోర్టు అనర్హత వేటు వేసింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవి చేపట్టేందుకు అనర్హుడని 4-3 మెజార్టీతో జడ్జీలు తీర్పు ఇచ్చారు. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ సెక్షన్ 3 ప్రకారం అధ్యక్ష అభ్యర్థిని అనర్హులుగా ప్రకటించడం ఇదే తొలిసారి. అయితే, ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునే అవకాశాన్ని ట్రంప్ కు కోర్టు కల్పించింది. దీంతో డొనాల్డ్ ట్రంప్ భవితవ్యాన్ని అమెరికా సుప్రీంకోర్టు తేల్చనుంది.

కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం వచ్చే ఏడాది మార్చి 5న జరిగే కొలరాడో రిపబ్లికన్స్ ప్రైమరీ బ్యాలట్ పై మాత్రమే కాకుండా, వచ్చే ఏడాది నవంబర్ 5న జరిగే సార్వత్రిక ఎన్నికలపై కూడా తీవ్రంగా ఉండనుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల తరువాత 2021 జనవరి 6న యూఎస్ క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడి చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించిన కారణంగా.. అమెరికా రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం కొలరాడో ఈ తీర్పు ఇచ్చింది.

మేము ఈ నిర్ణయానికి కాజువల్ గా రాలేదు. మా ముందు చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఏమిటో మాకు తెలుసు. చట్టాన్ని అమలు చేయడంలో మా కర్తవ్యంలో మేముకూడా దృఢంగా ఉన్నాము, మేము నిర్ణయాలు ఇస్తున్నాము. కొంత భయం, పక్షపాతం కారణంగా మా నిర్ణయం ఎలాంటి ప్రతిచర్యను తెస్తుందనే దానిగురించి మేము ఆందోళన చెందడం లేదు. చట్టాన్ని దృష్టిలో ఉంచుకుని మేము దీన్ని చేస్తున్నామని పేర్కొంటూ కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది.

ఇక్కడే ఆయనకు ఊరటను సైతం కల్పించింది సుప్రీంకోర్టు. ఈ తీర్పు కొలరాడో స్టేట్ వరకు మాత్రమే పరిమితమౌతుందని ప్రకటించింది. అంటే- కొలరాడో స్టేట్‌లో జరిగే ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ పేరు ఇక కనిపించదు. మిగిలిన రాష్ట్రాలకు ఈ తీర్పు వర్తించదు. అక్కడ ఆయన పోటీ చేయవచ్చు. ఈ తీర్పుపై ఏడుమంది న్యాయమూర్తులు గల ధర్మాసనంలో ఏకాభిప్రాయం రాలేదు. ముగ్గురు న్యాయమూర్తులు ఈ తీర్పును వ్యతిరేకించారు. నలుగురు ట్రంప్ నిషేధానికి మొగ్గు చూపారు. మెజారిటీ సభ్యులు ట్రంప్ అనర్హతకు అనుకూలంగా ఉండటంతో తీర్పు వెలువడింది.

Tags

Read MoreRead Less
Next Story