టికెట్ ఎక్స్ టెన్షన్ పాలసీ గడువు పొడిగించిన ఎమిరేట్స్ ఎయిర్లైన్స్

టికెట్ ఎక్స్ టెన్షన్ పాలసీ గడువు పొడిగించిన ఎమిరేట్స్ ఎయిర్లైన్స్
కోవిడ్ నిబంధనలతో విమాన ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్న కారణంగా చాలా మంది టికెట్ బుక్ చేసుకున్నా ప్రయాణం చేయలేకపోతున్న విషయం తెలిసిందే.

కోవిడ్ నిబంధనలతో విమాన ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్న కారణంగా చాలా మంది టికెట్ బుక్ చేసుకున్నా ప్రయాణం చేయలేకపోతున్న విషయం తెలిసిందే. అలాంటి వారికి ఊరటనిస్తూ దుబాయ్ ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ టికెట్ ఎక్స్ టెన్షన్ పాలసీని గతంలోనే ప్రకటించింది.

అయితే.. ఇప్పటికీ విమాన ప్రయాణాల విషయంలో పలు ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో టికెట్ ఎక్స్ టెన్షన్ పాలసీని కూడా పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే గతేడాది ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ లో టికెట్ బుక్ చేసుకున్నవారు అదే టికెట్ పై మరో ఏడాది కాలంలో ఎప్పుడైనా ప్రయాణించేందుకు వీలుంటుంది.

డిసెంబర్ 31, 2021 లోపు ప్రయాణానికిగాను సెప్టెంబర్ 30, 2021 కంటే ముందు టికెట్ బుక్ చేసుకున్నవారు రాబోయే మూడేళ్లలో ఎప్పుడైనా రీబుక్ చేసుకోవచ్చు. లేదంటే 12 నెలల్లో అదే టికెట్ పై ప్రయాణం చేయవచ్చు.

అలాగే డిసెంబర్ 31, 2021 లోపు ప్రయాణానికిగాను ఆక్టోబర్ 1, 2021 తర్వాత టికెట్ బుక్ చేసుకున్న వారు రాబోయే రెండేళ్లలో ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. దీనికి ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ వివరించింది.

ఒకవేళ నిర్ణీత గడువులోగా ప్రయాణం చేయకుంటే ఎలాంటి పెనాల్టీలు లేకుండా టికెట్ డబ్బులను తిరిగి ఇస్తామని దుబాయ్ ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ స్పష్టం చేసింది. అయితే.. నేరుగా టికెట్ కొన్నవారు, లేదంటే http://www.emirates.com నుంచి టికెట్ ఖరీదు చేసినవారు ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ తో సంప్రదించాల్సిన అవసరం లేదని వారి టికెట్ గడువు ఆటోమెటిక్ గా పొడిగిస్తామని వెల్లడించింది.

ఒకవేళ ఏజెంట్ల నుంచి టికెట్లను కొంటే మాత్రం టికెట్ గడువు ముగిసేలోగా వారిని సంప్రదించి మినహాయింపులు పొందాలని వివరించింది.

Tags

Read MoreRead Less
Next Story