Dubai Rains: భారీ వర్షాలు, వరదలతో దుబాయ్ అతలాకుతలం

ఏడాదిన్నరలో నమోదయ్యే వర్షపాతం కొన్ని గంటల్లోనే!

సాధారణంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ఎడారి దేశం కాబట్టి అక్కడ వర్షాలు తక్కువే. ఎప్పుడో కానీ.. భారీ వర్షాలు కురవవు. అలాంటి యూఏఈలో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి.

ఎడారి ప్రాంతమైన దుబాయ్ అకాల వర్షాలతో అతలాకుతలమైంది. మంగళవారం ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. ప్రపంచంలోనే అత్యంత బిజీ ఎయిర్‌పోర్టు అయిన దుబాయ్ విమానాశ్రయంలో ఆకస్మిక వరద విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించింది. అనేక విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. పలు సర్వీసులు రద్దయ్యాయి.

భారీ వర్షం కారణంగా దుబాయ్ మొత్తం అస్తవ్యస్తమైంది. పలు షాపింగ్ మాల్స్‌లో మోకాలిలోతు వరకూ నీరు చేసింది. అనేక రోడ్లు కొట్టుకుపోయాయి. పలు రెసిడెన్షియల్ ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్ల పైకప్పులు, తలుపులు, కిటికీల నుంచి నీరు కారే దృశ్యాలు అనేక మందిని ఆశ్చర్యానికి గురిచేశాయి. వరద దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. పర్యావరణ మార్పులపై ఆందోళన రెకెత్తించాయి.

ఈ వర్షం ప్రభావం దుబాయ్‌తో పాటూ యావత్ యూఏఈ, పొరుగున ఉన్న బహ్రెయిన్ వరకూ కనిపించింది. అక్కడ అనేక ప్రాంతాలను వరద ముంచేసింది. అన్ని ఎమిరేట్స్‌లలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఈ రోజు కూడా భారీ వర్షం కురిసే అవకాశం వుండటంతో ప్రభుత్యం తన ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించింది. ఇక ఒమన్‌లో వర్షం బీభత్సానికి పిల్లలతో సహా మొత్తం 18 మంది కన్నుమూశారు. దుబాయ్‌లో వర్షపు నీరు రోడ్లపై పరుగులు పెడుతోంది. ఆ నీటిలోనే వాహనాలు నెమ్మదిగా వెళుతున్నాయి. మరోవైపు అధికారులు నీటిని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. దుబాయ్‌కు సంబందించిన వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ‘ఇది ముంబై కాదు.. దుబాయ్’ అని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా ఓ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. రాతి ఎడారిగా పేరున్న ఎమిరేట్‌ ఆఫ్‌ ఫుజైరాలో కూడా 145 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. యూఏఈలో ఈ స్థాయి వర్షాలు చాలా చాలా అరుదు. కానీ గత 2-3 ఏళ్లుగా ఇలా కుంభవృష్టి కురుస్తోంది. వాతావారణ మార్పుల ప్రభావంతోనే ఈ పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయని నిపుణులు అంటున్నారు.

గతేడాది జరిగిన కాప్ 28 సదస్సులో యూఏఈ, ఒమన్‌లు.. నానాటికీ పెరుగుతున్న భూతాపం, పర్యావరణ మార్పులపై ఆందోళన వ్యక్తం చేశాయి. దిద్దుబాటు చర్యలకు పిలుపునిచ్చాయి.

Tags

Read MoreRead Less
Next Story