నెదర్లాండ్స్‌లో కుప్పకూలిన సంకీర్ణ ప్రభుత్వం

నెదర్లాండ్స్‌లో కుప్పకూలిన సంకీర్ణ ప్రభుత్వం
వలసల విధానంపై సంకీర్ణ కూటమిలో కుదరని ఏకాభిప్రాయం.... రాజీనామా లేఖను రాజు అలెగ్జాండర్‌కు అందజేసిన మార్క్‌ రట్‌.... అభిప్రాయ భేదాలు అధిగమించలేని స్థాయిలో ఉన్నాయని ప్రకటన

నెదర్‌లాండ్స్‌లో ప్రధాని మార్క్ రట్ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. దేశంలోకి వలసల నిరోధంపై ప్రభుత్వ కూటమిలోని నాలుగు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రట్‌ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను డచ్‌ రాజు విల్లెమ్ అలెగ్జాండర్‌కు అందజేశారు. అధికారం చేపట్టిన ఏడాదికే సంకీర్ణం ప్రభుత్వం కూలిపోయింది. సంకీర్ణ ప్రభుత్వంలోని పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే అన్న ప్రధాని.. ఈసారి చర్చల్లోనూ ఏకాభిప్రాయం కుదరలేదని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.


దేశంలో వలసల విధానంపై ఏకాభిప్రాయం కోసం కొన్ని రోజులుగా నెదర్లాండ్స్‌ ప్రభుత్వంలోని పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. విదేశీ శరణార్థులతో వలసల శిబిరాలు కిక్కిరిసిపోయిన విషయం వెలుగులోకి రావడం డచ్‌లో సంచలనం సృష్టించింది. వలసల కట్టడికి వీవీడీ పార్టీ నేత మార్క్ రట్ ప్రయత్నించారు. విదేశీ శరణార్థుల కుటుంబ సభ్యులను దేశంలోకి అనుమతించడంపై పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఆయన ప్రయత్నించి విఫలమయ్యారు. నెదర్లాండ్స్‌లో ఎక్కువ కాలం ప్రధానిగా ఉన్న నేతగా మార్క్ రట్‌ ఖ్యాతి గడించారు. యూరప్‌లో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతగానూ ఆయనకు పేరుంది. నవంబర్‌లోనే నెదర్లాండ్స్‌లో ఎన్నికలు జరగనుండగా ఆలోపే ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. నవంబర్ మధ్యలో మళ్లీ ఎన్నికలు నిర్వహించవచ్చని డచ్ ఎన్నికల సంఘం తెలిపింది.

2010 నుంచి నెదర్లాండ్స్‌లో నాలుగు సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడగా ఈ నాలుగు సార్లు మార్క్‌ రట్‌ ప్రధానిగా కొనసాగారు. 271 సుదీర్ఘ చర్చల తర్వాత జనవరి 2022లో డచ్‌లో నాలుగు పార్టీల భాగస్వామ్యంతో కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. అయినా ఈ పార్టీల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతూ వచ్చాయి. తాను రాజీనామా చేసినప్పటికీ అయిదోసారి ప్రధానిగా నిలబడే శక్తి తనకు ఉందని రట్‌ తెలిపారు. ఉక్రెయిన్‌కు మద్దతు అందించడం సహా చాలా పనులపై దృష్టి సారించాల్సి ఉందని అప్పటివరకూ తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తానని వెల్లడించారు.

మార్క్‌ రట్‌ ప్రభుత్వానికి కీలక మద్దతుదారు పార్టీ అయిన క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీ ప్రధాని తీరుపై విరుచుకుపడింది. నెదర్లాండ్స్‌లోకి అనుమతించిన యుద్ధ శరణార్థుల బంధువుల సంఖ్యను నెలకు 200కే పరిమితం చేయాలని ఆ పార్టీ డిమాండ్‌ చేసింది. పిల్లలు వారి తల్లిదండ్రులతో పెరిగే కుటుంబం కావాలని డచ్‌ డిప్యూటీ ప్రధాన మంత్రి కరోలా షౌటెన్ స్పష్టం చేశారు. యూరోపియన్ యూనియన్ మద్దతు ఉన్న BBB పార్టీ.. ఈ ఏడాదిలో జరిగే ఎన్నికలు విజయం సాధించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈసారి మార్క్‌ రట్‌ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు నిరాకరించిన BBB పార్టీ నాయకురాలు కరోలిన్ వాన్ డెర్ ప్లాస్...ఈసారి తానే ప్రధాని పదవి చేపట్టాలన్న సంకల్పంతో ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story