Earthquake: కంటతడిపెట్టిస్తున్న హృదయ విదారక దృశ్యాలు

Earthquake: కంటతడిపెట్టిస్తున్న హృదయ విదారక దృశ్యాలు
టర్కీ,సిరియాల్లో 15 వేలు మందికి పైగా మృతి

టర్కీ,సిరియాలలోని భూకంప ప్రభావిత ప్రాంతంలో హృతయ విదారక దృశ్యాలు కంటతడిపెట్టుస్తున్నాయి. పెద్దసంఖ్యలో భవనాలు నేలకూలడంతో అక్కడ శవాల దిబ్బగా మారింది. ఒకవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నా ఎక్కడా సిబ్బంది సరిపోవడంలేదు. భూకంప మృతులు గంట గంటలకు పెరుగుతున్నారు. ఇప్పటివరకు 15 వేలు మంది మృతిచెందినట్లు ప్రకటించారు. అయితే మొత్తం 20వేల మందికిపైగా మరణించి ఉంటారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఈ కారణంగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ఒక్క టర్కీలోనే సుమారు 9 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ ప్రకటించారు. సిరియాలో సుమారు 3వేల మందికిపైగా మరణించినట్లు తెలుస్తుంది. భవనాల శిథిలాలను తొలగిస్తుండటంతో ఏ రాయిని కదిపినా ప్రాణం లేని దేహాలే కనబడుతున్న దృశ్యాలు యావత్‌ ప్రపంచం హృదయాలను మెలిపెట్టేస్తున్నాయి. మరోవైపు, శిథిలాల కింద ఊపిరాడక ప్రాణం కోసం పోరాడుతున్న పలువురు చిన్నారుల్ని రెస్క్యూ సిబ్బంది గుర్తిస్తున్నారు. వారిని జాగ్రత్తగా బయటకు తీసి ఆస్పత్రులకు తరలిస్తున్నారు. బహుళ అంతస్తుల భవనాల శిథిలాల కింద కుటుంబ సభ్యుల మృతదేహాల దృశ్యాలు కలిచివేస్తున్నాయి.

రెస్క్యూ ఆపరేషన్‌లో దాదాపు 60వేల మందికిపైగా పాల్గొంటున్నారు.అయినా పెద్దయెత్తున భవనాలు కూలడంతో వారు ఎక్కడా సరిపోవడంలేదు. ఇప్పటివరకు దాదాపు 8వేలమందిని ప్రాణాలతో రక్షించారు. మరికొందరు శిథిలాల కింద ప్రాణాలతో ఉన్నారనే ఆశతో వారి కుటుంబ సభ్యులు భవనాల పక్కనే రోదిస్తూ ఉండటం అందరిని కలిచివేస్తోంది. దీంతో వారుచెప్పిన చోట శిథిలాలను తొలగిస్తూ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు. అయితే రోజులు గడుస్తుండటంతో శిథిలాల కింద ఉన్నవారు ప్రాణాలతో ఉండే అవకాశం తక్కువని భావిస్తున్నారు. ఏదో ఒక చివరి ఆశతో వేటను కొనసాగిస్తున్నారు.

భూకంప ప్రభావిత జోన్‌లో దాదాపు 20కి పైగా దేశాల నుంచి వెళ్లిన సహాయక బృందాలు టర్కీ అత్యవసర బృందాలతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. భూకంప తీవ్రతకు టర్కీలోని 85 మిలియన్ల జనాభాలో 13 మిలియన్ల మంది ప్రభావితమయ్యారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. క్షతగాత్రులతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. గాయపడిన వారికి చికిత్స చేసేందుకు వైద్యుల కొరత కూడా వేధిస్తోంది. భూ విలయం తీవ్రత అధికంగా ఉన్న 10 ప్రావిన్స్‌లలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఆయా ప్రాంతాల నుంచి దాదాపు 4 లక్షల మందిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story