Afghanistan Earthquake : అఫ్ఘానిస్థాన్‌లో మళ్లీ భూకంపం.

Afghanistan Earthquake :  అఫ్ఘానిస్థాన్‌లో  మళ్లీ భూకంపం.
రిక్టర్‌ స్కేలుపై 6.1 తీవ్రత నమోదు

ఇటీవల వరుస భూకంపాలతో దద్ధరిల్లిన అఫ్ఘానిస్థాన్‌లో సహాయక చర్యలు కొనసాగుతుండగానే మరో భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 6.11 గంటలకు 6.1 తీవ్రతతో భూమి కంపించింది. హెరాత్ నగరానికి 29 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ వెల్లడించింది. అయితే ఈ భూకంపం వల్ల జరిగిన ఆస్తి నష్టం, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. దీని తీవ్రతను 6.3గా రికార్డ్ చేసింది జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్. అయితే ప్రాణనష్టం, ఆస్తి నష్టం గురించి తక్షణ సమాచారం అందలేదు. ఇక శనివారం సంభవించిన ప్రకృత్తి విపత్తు గ్రామాలను గ్రామాలనే తుడిచిపెట్టేసిన విషయం తెలిసిందే. భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య రెండు వేలు దాటినట్లు అక్కడి ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు. భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 4 వేలు దాటిందని అప్ఘానిస్తాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రతినిధి ముల్లా సైక్ తెలిపారు.


అఫ్గానిస్తాన్‌లో గత 20 ఏళ్లలో సంభవించిన భారీ భూకంపాల్లో ఇదీ ఒకటని అధికారులు పేర్కొన్నారు. అయితే శనివారం నాటి భూకంపాన్ని మరచిపోకముందే ఇవాళ మరోసారి భూకంపం అఫ్ఘాన్‌ను వణికించింది. ఇటీవలే కొన్ని గంటల వ్యవధిలో సంభవించిన వరుస భూకంపాలు అఫ్ఘానిస్థాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. భూకంప ప్రాంతాల్లో భారీ భవనాలు కుప్పకూలడంతో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. నాలుగు రోజులుగా జరుగుతున్న సహాయక చర్యల్లో ఇప్పటి వరకు 4 వేల మృతదేహాలను వెలికితీశారు. ఇంకా శిథిలాల తొలగింపు కొనసాగుతున్నది. ఇంతలోనే మళ్లీ భూకంపం సంభవించడం ఆఫ్ఘానిస్థాన్‌ను ఆందోళనకు గురిచేస్తున్నది.


భూ ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల ఈ ప్రకంపనలు సంభవించినట్లు తెలిపింది. ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు నమోదు అయ్యాయి. ఫలితంగా- స్థానికులెవ్వరూ తమ నివాసాల్లోకి వెళ్లడానికి భయపడ్డారు. రోడ్ల మీదే గడుపుతున్నారు. మరోవైపు మట్టిదిబ్బల్లా మారిన ఇళ్ల శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం స్థానికులు, సహాయక సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని చెప్పారు.



Tags

Read MoreRead Less
Next Story