Hindu Temple: ముస్లిం దేశంలో ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం

Hindu Temple: ముస్లిం దేశంలో ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం
14న ప్రారంభించనున్న మోదీ

అయోధ్య రామ మందిరం ప్రారంభం తర్వాత భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నUAEలోని అతిపెద్ద హిందూ దేవాలయం ఆరంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. సుమారు 108 అడుగుల ఎత్తుతో 27 ఎకరాల్లో అబుదాబిలో నిర్మించిన ఈ మందిరాన్ని బుధవారం ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. నాలుగేళ్ల పాటు వేలాది మంది కళాకారులు చెక్కిన రాళ్లను జిగ్సా పజిల్‌లా పేర్చి గుడిని నిర్మించారు. భారతీయ శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా బాప్స్‌ స్వామినారాయణ్‌ సంస్థ ఈ ఆలయాన్ని నిర్మించింది.

అయోధ్య రామ మందిరం తర్వాత మరో హిందూ దేవాలయం భక్తులకు అందుబాటులోకి రానుంది. యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌-UAEలోని అబూ మురీఖాలో భారత శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడేలా ఆలయం రూపుదిద్దుకుంది. బోచ సన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్‌-బాప్స్ సంస్థ ఈ ఆలయాన్ని నిర్మించింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బుధవారం ఈ మందిరం ప్రారంభం కానుంది. కార్యక్రమం కోసం మంగళవారం UAE వెళ్లనున్న ప్రధాని తొలుత అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీలో 35 లక్షల మంది భారతీయుల్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.


సుందరంగా కనిపిస్తున్న ఈ ఆలయాన్ని 27 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ గుడిలో 402 స్తంభాలు ఉన్నాయి. ఒక్కో స్తంభంపై హిందూ దేవతామూర్తుల ప్రతిమలు, పలు సంగీత వాయిద్యాలు, వన్యప్రాణుల చిత్రాలున్నాయి. ఆలయం ఎత్తు 108 అడుగులు ఉంటుంది. మందిర నిర్మాణం కోసం రాజస్థాన్‌ నుంచి పింక్ స్టోన్స్‌, ఇటలీ నుంచి పాలరాయిని తెప్పించారు. మందిర రూపకల్పనలో 25 వేల టన్నుల రాళ్లను వాడారు. తాజాగా విడుదలైన ఆలయ దృశ్యాలు అబ్బురపరుస్తున్నాయి.

ఇటలీ నుంచి తెప్పించిన పాలరాళ్లను తొలుత రాజస్థాన్‌లోని పలు గ్రామాలకు పంపించారు. సుమారు నాలుగేళ్ల పాటు 5 వేల మంది కళాకారులు...ఆలయంలోని ప్రతి భాగాన్ని చేతితో చిన్న రాళ్లుగా చెక్కారు.ఇందుకు కేవలం సుత్తి, ఉలిని మాత్రమే వాడారు. అలా రూపొందించిన విడి భాగాలను UAE లోని 150కి పైగా కళాకారులు రెండేళ్లుగా వాటిని ఒక దగ్గరకు పేర్చారు. జిక్సా పజిల్‌లో మాదిరిగా రాళ్లను కలిపి ఈ అద్భుత నిర్మాణాన్ని రూపొందించారు. మందిర రూపకల్పనలో ఎలాంటి ఇమును గానీ ఆ తరహా మరో పదార్థం గానీ వాడలేదు. హిందూ శాస్త్రాలకు అనుగుణంగా పూర్తి సహజంగా నిర్మితమైన ఈ మందిరం వెయ్యేళ్లకు పైగా చెక్కుచెదరకుండా ఉంటుందని నిర్వహకులు తెలిపారు.


మందిరానికి కావాల్సిన భూమిని UAE అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్‌ నహ్యన్ ఇచ్చారని బాప్స్ డైరెక్టర్ ప్రణవ్ దేశాయ్ తెలిపారు. ఈ ఆలయానికి 7 గోపురాలు ఉంటాయనీ... యునైటైడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఏడు 7 ఎమిరేట్స్‌ను అవి సూచిస్తాయని చెప్పారు. ఇది యూఏఈకి కృతజ్ఞతను తెలియజేయడం లాంటిదని ఆయన పేర్కొన్నారు. భారత ప్రభుత్వం నుంచి లభించిన సహకారం కూడ అద్భుతమైన నిర్మాణం సాధ్యమవ్వడానికి కారణమని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story