మాస్క్ పెట్టుకోలేదని రెండేళ్ల పాపని ఫ్లైట్ నుంచి..

మాస్క్ పెట్టుకోలేదని రెండేళ్ల పాపని ఫ్లైట్ నుంచి..
నాన్న మాస్క్ పెట్టడం.. చిన్నారి పీకి పడేయడం చేస్తోంది.. ఇదంతా చూస్తున్న ఎయిర్ హోస్టెస్‌కి చిర్రెత్తుకొచ్చింది.

మాస్క్ పెట్టుకోవడం పెద్దవాళ్లకే కష్టంగా ఉంటోంది.. ఇంక చిన్నపిల్లల సంగతి చెప్పక్కర్లేదు. అసౌకర్యంగా అనిపించి మాటి మాటికీ పీకి పడేస్తుంటారు. ఎక్కింది ఫ్లైటు.. ఎందుకొచ్చిన గొడవ తల్లీ పెట్టుకో అంటే కూడా వినకుండా నాన్న మాస్క్ పెట్టడం.. చిన్నారి పీకి పడేయడం చేస్తోంది.. ఇదంతా చూస్తున్న ఎయిర్ హోస్టెస్‌కి చిర్రెత్తుకొచ్చింది.

న్యూజెర్సీకి చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్న ఓ జంటను కిందికి దించేశారు. వారి రెండేళ్ల కుమార్తె మాస్క్ ధరించడానికి నిరాకరించింది. వైమానిక మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకుగాను చిన్నారి సహా తల్లిదండ్రులను దించేశారు.

ఈ జంట తమ కుమార్తెతో కలిసి న్యూజెర్సీ యొక్క నెవార్క్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లడానికి డెన్వర్ నుండి విమానంలో ఎక్కారు. విమాన సిబ్బంది సూచనల మేరకు పాపకు మాస్క్ పెట్టాలని ఎంత ప్రయత్నించినా చేతులతో నెట్టివేస్తూ మాస్క్ పెట్టుకోవడాన్ని తిరస్కరించింది. అప్పటికీ విమాన సిబ్బంది ఓపిగ్గా ప్రయత్నించారు. అయినా పాప ససేమిరా అనడంతో రూల్స్‌ని బ్రేక్ చేయడం మా చేతుల్లో లేదంటూ ఆ కుటుంబాన్ని విమానం నుంచి దించేశారు.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో, రెండేళ్ల తల్లి ఎలిజ్ ఓర్బన్ విమానయాన సిబ్బంది తమను నిర్ధాక్షణ్యంగా క్రిందకు దించడాన్ని తప్పు పడుతూ విమానయాన సంస్థకు పోస్ట్ పెట్టింది. పాప మాస్క్ పెట్టుకోనని మారాం చేసిన వీడియోని సైతం పోస్ట్ చేసింది. ఆమె పోస్ట్‌పై స్పందించిన విమానయాన సంస్థ క్షమాపణలు కోరుతూ సిబ్బందిపై తగిన చర్య తీసుకుంటామని తెలిపింది. టిక్కెట్లకు సంబంధించిన డబ్బును తిరిగి చెల్లించింది. కాగా, ఆగస్ట్‌లో విడుదల చేసిన కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story