Egypt: రఫా క్రాసింగ్ నుంచి పౌరులకు ఈజిప్టు అనుమతి..

Egypt: రఫా క్రాసింగ్ నుంచి పౌరులకు ఈజిప్టు అనుమతి..
విదేశీయులకు మొదటి ఛాన్స్

ఇజ్రాయెల్‌ భీకర దాడులతో మూడు వారాలుగా మరుభూమిని తలపిస్తున్న గాజా నుంచి ఎట్టకేలకు కొందరు బయటపడ్డారు. విదేశీ పాస్ట్‌పోర్టులు కలిగిన ఉన్న వారు, తీవ్ర గాయాలపాలైన వారు గాజాను వీడి తమ దేశం వచ్చేందుకు ఈజిప్టు అంగీకరించింది. ఖతార్‌ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందం.. వారికి ఉపశమనం కలిగించింది. తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులకు తమ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తామని ఈజిప్టు తెలిపింది.

గాజాస్ట్రిప్‌లో విదేశీ పాస్‌పోర్టులు కలిగిఉన్న వారు, తీవ్రంగా గాయపడ్డవారికి ఉపశమనం కలిగింది. గాజా స్ట్రిప్‌ నుంచి ఈజిప్టుకు వెళ్లే కీలక రఫాక్రాసింగ్‌.. వీరి కోసం తెరుచుకుంది. ఇందుకు ఈజిప్టు, హమాస్‌, ఇజ్రాయెల్‌ మధ్య అమెరికా మద్దతుతో ఖతర్‌ మధ్యవర్తిత్వంతో ఒప్పందం కుదిరింది. విదేశీ పాస్‌పోర్టుదారులే కాక తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులను కూడా తరలించేందుకు గాజాను అష్టదిగ్బంధనం చేసిన ఇజ్రాయెల్‌తో పాటు ఈజిప్టు కూడా అంగీకరించింది. గాజాలో తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులకు తమ దేశంలోని ఆస్పత్రుల్లో చికిత్స అందించేందుకు ఈజిప్టు అంగీకరించింది. తమ దేశం నుంచి గాజా లోపలికి ఈజిప్టు అంబులెన్సులను పంపించి.. తీవ్రంగా గాయపడ్డవారిని తీసుకెళుతోంది. ఇప్పటి వరకు 88 మందిని అంబులెన్సులలో ఈజిప్టుకు తీసుకెళ్లింది.


ఈ ఒప్పందం ఎన్నిరోజులు అమలులో ఉంటుందో ఏ దేశం కూడా వెల్లడించలేదు. అలాగే.. ఒప్పందం కుదరడానికి అటు హమాస్‌ గానీ ఇటు.. ఇజ్రాయెల్‌ గానీ ఎలాంటి షరతులు విధించలేదు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. బుధవారం 500 మంది విదేశీ పాస్‌పోర్టుదారులను గాజా వీడి ఈజిప్టు వచ్చేందుకు అనుమతిస్తున్నారు. గాజా జనాభా 23 లక్షలుకాగా వీరిలో ఎంతమందికి విదేశీ పాస్‌పోర్టులు ఉన్నాయో అధికారికంగా ఎవరూ వెల్లడించలేదు.

మరోవైపు హమాస్‌ నుంచి కీలక ప్రకటన వెలువడింది. తమ దగ్గర ఉన్న 200 దాకా బందీల్లో ఇజ్రాయెల్‌ కాకుండా ఇతర దేశాలకు చెందిన వారిని విడుదల చేస్తామని హమాస్‌ ప్రకటించింది. ఈ మేరకు హమాస్‌ పోరాట విభాగం.. ప్రతినిధి అల్‌ ఖస్సామ్‌ తెలిపారు.

దీనికి కూడా ఖతార్‌ మధ్యవర్తిత్వం వహించినట్లు సమాచారం.యుద్ధం ప్రారంభమైన తర్వాత రఫా సరిహద్దు చాలా కీలకంగా మారింది. గాజాలోకి మానవతా సాయం అందించేందుకు ఈ క్రాసింగ్‌ అత్యంత కీలకం. అయితే చాలా రోజులు ఇజ్రాయెల్‌ అంగీకరించకపోవడంతో మానవతా సాయంతో నిండిన ట్రక్కులు ఈజిప్టులోనే నిలిచిపోయాయి. తర్వాత వివిధ దేశాల జోక్యంతో మానవతాసాయాన్ని రఫా గుండా గాజాలోకి ఇజ్రాయెల్‌ అనుమతించింది

Tags

Read MoreRead Less
Next Story