Human Trafficking: భారతీయులున్న విమానం ఫ్రాన్స్‌లో నిలిపివేత.. స్పందించిన భారత్‌

Human Trafficking: భారతీయులున్న  విమానం ఫ్రాన్స్‌లో నిలిపివేత.. స్పందించిన భారత్‌
ప్రయాణికుల భద్రత కోసం చర్యలు తీసుకున్నామని వివరణ

మానవ అక్రమ రవాణా జరుగుతోందన్న అనుమానంతో భారత ప్రయాణికులతో వెళ్తున్న విమానాన్ని ఫ్రాన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. దీనిపై ఫ్రాన్స్‌లోని భారత దౌత్య కార్యాలయం స్పందించింది. ఈ ఘటనపై భారత అధికారులతో ఫ్రాన్స్‌ సిబ్బంది మాట్లాడి అన్ని విషయాలు వివరించారు.

దౌత్య బృందానికి కాన్సులర్ యాక్సెస్ లభించిందని ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని...ప్రయాణికుల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని.. భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. రొమేనియాకు చెందిన లెజెండ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ నుంచి నికరాగువాకు బయల్దేరింది. ఇంధనం నింపడం కోసం శుక్రవారం ఫ్రాన్స్‌లోని వాట్రీ ఎయిర్‌పోర్టులో దిగింది. అప్పటికే మానవ అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారం అందుకున్న ఫ్రాన్స్‌ అధికారులు ఈ విమానాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.మానవ అక్రమ రవాణ ఆరోపణలతో ప్రయాణికుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

300 మంది భారత ప్రయాణికులు, సిబ్బంది గుర్తింపు పత్రాలను తనిఖీ చేస్తున్నామని అలాగే వారి ప్రయాణానికి గల కారణాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. జాతీయ వ్యవస్థీకృత నేర నిరోధక విభాగం నేతృత్వంలో ఈ దర్యాప్తు కొనసాగుతోంది ప్రయాణికుల్లో మైనర్లు కూడా ఉన్నారని సమాచారం. అమెరికా, కెనడాల్లోకి అక్రమంగా ప్రవేశించాలనే ప్రణాళికలో భాగంగా ఆ ప్రయాణికులంతా నికరాగువాకు వెళ్తున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులంతా యూఏఈలో పని చేస్తుండొచ్చని లెజెండ్ ఎయిర్‌లైన్స్‌ పేర్కొంది. తమ వైపు నుంచి ఎలాంటి తప్పులేదని భావిస్తున్నట్లు తెలిపింది.

మరోవైపు, ఈ ఘటనపై ఫ్రాన్స్‌లో భారత రాయబార కార్యాలయం రంగంలోకి దిగింది. భారతీయ అధికారులు అక్కడకు చేరుకుని, ప్రయాణికులకు అవసరమైన ఏర్పాట్లును పర్యవేక్షిస్తున్నారు. ‘ఫ్రాన్స్ అధికారులు 303 మందితో కూడిన విమానం అదుపులోకి తీసుకున్న విషయం గురించి మాకు తెలియజేశారు. దుబాయ్ నుంచి నికరాగ్వా వెళ్తున్న విమానంలో ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు.. ఫ్రెంచ్ విమానాశ్రయంలో సాంకేతికంగా నిలిపివేశారు. దౌత్య కార్యాలయ బృందం అక్కడికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తోంది ప్రయాణీకుల క్షేమ సమాచారంపై కూడా ఆరా తీశారు’ అని ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.

అయితే, అమెరికా లేదా కెనడాలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించే ప్రయత్నంలో భాగంగా మధ్య అమెరికాకు వెళ్లాలని ప్లాన్ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఫ్రాన్స్‌లో దిగిన తర్వాత వారిని మొదట విమానంలో ఉంచారు. తర్వాత టెర్మినల్ భవనంలో బస ఏర్పాటు చేశారు. వాట్రీ విమానాశ్రయంలోని రిసెప్షన్ హాల్‌లో వారికి బస ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story