Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో హైదరాబాద్‌ వాసి మృతి

Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో హైదరాబాద్‌ వాసి మృతి
ఉద్యోగం పేరుతో మోసం..

రష్యా - ఉక్రెయిన్ పోరులో హైదరాబాద్ వాసి మృతి చెందాడు. ఈ రెండు దేశాల మధ్య రెండేళ్లుగా యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరఫున పోరాడుతూ హైదరాబాద్‌కు చెందిన 30 ఏళ్ల మహ్మద్ అఫ్సాన్ ప్రాణాలు కోల్పోయాడు. అఫ్సాన్ మృతి చెందినట్లు అధికారులు బుధవారం ధ్రువీకరించారు. ఉద్యోగం విషయంలో మోసపోయి అతను రష్యన్ ఆర్మీలో బలవంతంగా చేరాల్సి వచ్చినట్లుగా తెలుస్తోంది.

మహ్మద్‌ అస్ఫాన్‌ యుద్ధంలో చనిపోయిన విషయాన్ని అధికారులు బుధవారం ధ్రువీకరించారు. రష్యా నుంచి తన కుమారుడిని తిరిగి రప్పించేందుకు సాయం చేయాలని అస్ఫాన్‌ కుటుంబసభ్యులు ఇటీవల ఎంఐఎం చీఫ్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీని కోరారు. దీంతో ఆయన మాస్కోలోని భారత రాయబార కార్యాలయ అధికారులను సంప్రదించగా.. అస్ఫాన్‌ మరణించినట్టు అక్కడి అధికారులు తాజాగా వెల్లడించారు.

అస్ఫాన్‌ హైదరాబాద్‌లో బట్టల దుకాణంలో పనిచేసేవాడు. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న అతనికి ఒక ఏజెంట్‌ పరిచయమయ్యాడు. రష్యా రాజధాని మాస్కోలో ఉద్యోగాలున్నాయంటూ నమ్మించాడు. అస్ఫాన్‌ గత ఏడాది డిసెంబర్‌లో రష్యాకు వెళ్లాడు. అక్కడ రష్యా ఆర్మీకి హెల్పర్‌గా పనిచేయాలని సూచించారు. ఈ క్రమంలోనే అస్ఫాన్‌ రష్యా తరపున యుద్ధంలోకి వెళ్లాల్సి రావడంతో, అక్కడి జరిగిన కాల్పుల్లో మృతి చెందాడు. మహ్మద్‌ అస్ఫాన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అస్ఫాన్‌ మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు సంప్రదింపులు చేస్తున్నట్టు మాస్కోలోని భారత ఎంబసీ పేర్కొన్నది.

రష్యా సైన్యానికి సహాయక సిబ్బందిగా పని చేస్తోన్న దాదాపు ఇరవై మంది భారతీయులను తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన కొన్ని రోజులకే ఈ విషాదం చోటు చేసుకుంది.

ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో రష్యా ఆర్మీ హెల్పర్‌గా నియమితులైన గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన హమిల్‌ మంగుకియా అనే 23 ఏండ్ల యువకుడు కూడా కొన్ని వారాల క్రితం మరణించాడు. హమిల్‌ ఒక ఆన్‌లైన్‌ ప్రకటన ద్వారా రష్యాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొన్నాడు. ఏజెంట్ల సమాచారం మేరకు ఆ తర్వాత అతను చెన్నై మీదుగా మాస్కో చేరుకొన్నాడు. అనంతరం అతన్ని రష్యా ఆర్మీలో సహాయకుడిగా నియమించారు.

Tags

Read MoreRead Less
Next Story