హెచ్‌1బీ వీసాల జారీలో ట్రంప్‌ మరో ఎత్తుగడ

హెచ్‌1బీ వీసాల జారీలో ట్రంప్‌ మరో ఎత్తుగడ

విదేశీ నిపుణులకు హెచ్‌1బీ వీసాలు జారీ చేసేందుకు వినియోగించే కంప్యూటరైజ్డ్‌ లాటరీ విధానానికి స్వస్తి పలకాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. లాటరీ విధానం స్థానంలో ఇకపై వేతన స్థాయి ఆధారంగా హెచ్‌1బీ వీసాలు ఇవ్వాలని.. ఈ మేరకు వీసా విధానంలో మార్పులు చేస్తున్నట్లు అమెరికా హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఇది ప్రతిపాదన దశలో ఉంది. 30 రోజుల స్పందన కాలంలో ఫెడరల్‌ రిజిస్టర్‌లో ప్రకటన జారీ అయింది. ఈ వ్యవధిలో తాజా ప్రతిపాదనలపై అభిప్రాయాలు స్వీకరిస్తారు.

నూతన విధానంలో అత్యధిక వేతనం అందుకునే వారికి తొలి ప్రాధాన్యత ఉంటుంది. తక్కువ జీతం అందుకునే వారికి హెచ్‌1బీ వీసా జారీ చేసే అవకాశాలు తక్కువగానే ఉంటాయి. విదేశాలకు చెందిన వారు, ముఖ్యంగా భారతీయులు తక్కువ వేతనాలకు కూడా అమెరికా వస్తుండటంతో స్థానిక అమెరికన్లు ఉద్యోగ అవకాశాల్లో వెనుకబడిపోతున్నారన్నది ట్రంప్‌ అభిప్రాయం. అందుకే ఎక్కువ వేతన స్థాయి నిపుణులకు ఎక్కువ ప్రాధాన్యత అనే కొత్త వీసా విధానం తెరపైకి తెచ్చారు.

ప్రతి ఏడాది అమెరికాకు భారత్‌ నుంచే కాకుండా అనేక దేశాల నుంచి లక్షల్లో వలస వస్తుంటారు. వీరిలో హెచ్‌1బీ వీసాలు కోరేవారిని కంప్యూటర్‌ ద్వారా లాటరీ తీసి 65వేల మందికి వీసాలు జారీ చేస్తుంటారు. విదేశీ నిపుణులకు వీసాల జారీపై ఆది నుంచి కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్‌ ప్రభుత్వం.. ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు కొత్తగా హెచ్‌1బీ, ఎల్‌-1 వీసాలను మంజూరు చేయకుండా తాత్కాలిక నిషేధం విధించింది.

Tags

Read MoreRead Less
Next Story