ముంబయి పేలుళ్ల కుట్రలో కీలక సూత్రధారి హఫీజ్‌ సయీద్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష

ముంబయి పేలుళ్ల కుట్రలో కీలక సూత్రధారి హఫీజ్‌ సయీద్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష
X

ముంబయి పేలుళ్ల కుట్రలో కీలక సూత్రధారి హఫీజ్‌ సయీద్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. పాక్‌ ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం హఫీజ్‌కు శిక్ష విధించింది. సయీద్ ఆస్తులను కూడా జప్తు చేయాలని ఆదేశించింది. పాక్ ఉగ్రవాద సంస్థలకు నిధులు అందిస్తున్నారన్న కేసులో సయీద్‌కు ఇప్పటికే 11 ఏళ్లు జైలు శిక్ష పడింది. లాహోర్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. తాజాగా హఫీజ్‌తో పాటు మరో నలుగురికి పాకిస్తాన్‌ ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఉగ్ర సంస్థలకు నిధులు అందిస్తున్నారన్న ఆరోపణలపై అతడితో పాటు జేయూడీ సభ్యులపై పాక్‌ ఉగ్ర నిరోధక విభాగం దాదాపు 41 కేసులు పెట్టింది. వాటిల్లో రెండు కేసుల్లో శిక్ష పడింది.

2008 ముంబయి పేలుళ్ల ఘటనలో 166 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. హ‌ఫీజ్‌కు శిక్ష పడేలా చేయడంలో భారత్ అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే ఐక్యరాజ్యసమితి.. అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో హఫీజ్ సయీద్ పేరును చేర్చింది. జమాత్ ఉద్ దవా అనే ఉగ్రవాద సంస్థకు చీఫ్‌గా ఉంటూనే... లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థను కూడా ముందుండి నడిపిస్తున్నాడు సయీద్‌. అంత‌ర్జాతీయ ఒత్తిళ్ల కార‌ణంగా పాకిస్తాన్ గ‌త ఏడాది జులై 17న.. టెర్రర్ ఫండింగ్ కేసులో హఫీజ్‌ను అరెస్టు చేసింది. యాంటీ టెర్రర్ కోర్టులో సయీద్‌కు 11 ఏళ్ల శిక్ష పడింది. హఫీజ్ సయీద్‌పై అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ముద్ర వేసింది. సయీద్ తలపై అమెరికా 10 మిలియన్‌ డాలర్ల పారితోషికం ప్రకటించింది.

హఫీజ్‌తో పాటు అతని సన్నిహితుడు అబ్దుల్ రెహ్మాన్ మక్కికి ఆరు నెలల జైలు శిక్ష విధించారు. వీరు ఉగ్రకార్యకలాపాల కోసం నిధులు సమీకరించారనే ఆరోపణలపై హఫీజ్ సయీద్‌, అబ్దుల్ రెహ్మాన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. రెండు వారాల క్రితమే నిషేధిత జమా-ఉద్-దవాలోని కీలక నాయకులకు 16 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. వీరిలో హఫీజ్ సయీద్ బావ కూడా ఉన్నాడు.

Next Story

RELATED STORIES