Gaza: గాజాలో ఆహారం అర్థిస్తున్న వారిపై కాల్పులు..

Gaza: గాజాలో ఆహారం అర్థిస్తున్న వారిపై కాల్పులు..
29 మంది మృతి

ఇజ్రాయెల్‌ – హమాస్‌ యుద్ధంతో పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌ లో విధ్వంసం నెలకొంది. ఓ వైపు పౌరుల మరణాలు, మరోవైపు ఆకలి కేకలతో గాజాలో పరిస్థితి దయనీయంగా మారింది. అక్కడి ప్రజలు ఆకలి కేకలతో అల్లాడుతున్నారు. మానవతా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. యుద్ధానికి కేంద్రంగా మారిన ఈ ప్రాంతంలో తాజాగా ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆహారం కోసం వేచి చూస్తున్న వారిపై ఇజ్రాయెల్‌ సైనికులు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ కాల్పుల ఘటనలో సుమారు 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

చాలా మంది పౌరులు ఆహారం కోసం ఉత్తర గాజా రౌండ్‌అబౌట్ వద్ద ట్రక్కు కోసం వేచి ఉన్నట్లు తెలిపింది. ఆ సమయంలో ఇజ్రాయెల్‌ దళాలు ఒక్కసారిగా కాల్పులకు పాల్పడినట్లు పేర్కొంది. ఈ ఘటనలో 29 మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారుగా 150 మందికిపైగా గాయాలపాలైనట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నట్లు పేర్కొంది.

మరోవైపు ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఆసుపత్రికి వస్తున్న క్షతగాత్రులను పర్యవేక్షించడం సాధ్యం కావడం లేదని.. సరైన వసతులు, ఔషధాలు లేవని వెల్లడించింది. గాజా ఉత్తర భాగంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొనడంతో వేలాది మంది సామాన్య పౌరులు మానవతా సాయం కోసం వేచిచూస్తున్నారని తెలిపింది. అలాంటి వారిని ఇజ్రాయెల్‌ లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించింది.

యుద్ధంతో తీవ్రంగా నష్టపోయిన గాజా ప్రజలను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు మానవతా సాయం చేసేందుకు ముందుకొస్తున్నాయి. రోడ్డు, వాయు, సముద్రం మార్గాల ద్వారా ఆహారాన్ని అందజేస్తున్నాయి. మరోవైపు దాదాపు 200 టన్నుల ఆహార పదార్థాలతో సిప్రస్‌ నుంచి ఓ భారీ నౌక గాజాకు బయల్దేరింది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా దెబ్బతిన్న మౌలిక సదుపాయాల కారణంగా, గాయపడిన వారిని ఆసుపత్రులకు తీసుకురావడం కష్టంగా మారిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆసుపత్రుల్లో చికిత్సకు తగినంత వనరులు లేనందున మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ ప్రకటన పేర్కొంది. గాజా సివిల్ డిఫెన్స్ ప్రతినిధి మహమూద్ బస్సల్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ ట్యాంకులు షెల్లింగ్ ప్రారంభించే ముందు, సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజలపై ఇజ్రాయెల్ సైనిక హెలికాప్టర్లు కాల్పులు జరిపాయి. ఇజ్రాయెల్ రెండు చోట్ల దాడులు చేసింది. మొదటి సంఘటనలో ఇజ్రాయెల్ ఆర్మీ హెలికాప్టర్లు సహాయ పంపిణీ కేంద్రం వద్ద సహాయాన్ని ఏర్పాటు చేస్తున్న వ్యక్తులపై కాల్పులు జరిపాయి. అక్కడ సుమారు ఎనిమిది మంది మరణించారు. రెండవ కేసు ఉత్తర గాజా నుండి వెలుగులోకి వచ్చింది, సహాయ ట్రక్కుల కోసం వేచి ఉన్న వ్యక్తులపై ఇజ్రాయెలీ ట్యాంకులు కాల్పులు జరిపాయి. ఇందులో చాలా మంది మరణించారు.

Tags

Read MoreRead Less
Next Story