2021 సంవత్సరానికి స్వాగతం పలికిన న్యూజీలాండ్‌

2021 సంవత్సరానికి స్వాగతం పలికిన న్యూజీలాండ్‌

కరోనాతో కాలగర్భంలో ఓ ఏడాది, మరో దశాబ్దం కలిసిపోతోంది. మరికొద్ది గంటల్లో భారత్‌లో నూతన సంవత్సరం మొదలుకానుంది. అయితే మనకంటే ముందే కొన్ని దేశాలు కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాయి. పసిఫిక్‌ మహా సముద్రంలోని సమోవా ద్వీపం అందరికంటే ముందుగా 2021ని ఆహ్వానించింది. మన కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 3.30 గంటలకే అక్కడ నూతన సంవత్సరం వచ్చేసింది. కాసేపటికే టోంగా, కిరిబాటి దీవులు కూడా 2021లోకి అడుగుపెట్టాయి. ఆ తర్వాత న్యూజిలాండ్‌ కూడా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించింది. భారత్‌లో సాయంత్రం 4.30 గంటలు అవుతున్నప్పుడు వెల్లింగ్టన్‌ కొత్త ఏడాదికి స్వాగతం పలికింది.

ఆస్ట్రేలియాలో మనకంటే అయిదున్నర గంటల ముందు కొత్త ఏడాది మొదలవుతుంది. ఇక సూర్యోదయ భూమిగా పేరున్న జపాన్‌ కూడా మూడున్నర గంటల ముందే 2021లోకి అడుగుపెడుతుంది. ఇదే సమయానికి దక్షిణ కొరియా, ఉత్తరకొరియా కూడా కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తుంది. భారత్‌ పొరుగు దేశాలైన భూటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌లు మనకంటే.. 30 నిమిషాల ముందు కొత్త సంవత్సరంలోకి వెళ్తాయి.

సమోవాలో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమైన ఎనిమిదిన్నర గంటలకు మనం 2021లోకి అడుగుపెడతాం. అదే సమయానికి భారత్‌తో పాటు శ్రీలంకలోనూ జనవరి ఒకటి వస్తుంది. ఇక మన తర్వాత సుమారు నాలుగున్నర గంటలకు అత్యధికంగా 43 దేశాలు ఒకేసారి కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతాయి. వాటిలో జర్మనీ, నార్వే, ఫ్రాన్స్‌, ఇటలీ లాంటి ఐరోపా దేశాలతో పాటు కాంగో, అంగోలా, కామెరూన్‌ లాంటి ఆఫ్రికా దేశాలు ఉన్నాయి.


Tags

Read MoreRead Less
Next Story