Hawaii : హవాయి కార్చిచ్చుకు నిర్లక్ష్యమే కారణమా

Hawaii : హవాయి కార్చిచ్చుకు నిర్లక్ష్యమే కారణమా
106 మంది బలి, రూ.50వేల కోట్ల నష్టం.. అధికారులు ముందే స్పందించి ఉంటే...

అంతటి అగ్రరాజ్యం అమెరికాను ఓ కార్చిచ్చు వణికించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా తమకు చెందిన మావీయ్ దీవిలో మంటలు బీభత్సం సృష్టిస్తే ఏమీ చేయలేకపోయింది. సైరన్లు మోగకపోవడంతో వంద మందికిపైగా అగ్నికి ఆహుతయ్యారు. ప్రమాదం జరిగిన తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఘటన సమయంలో దీవిలోని సైరన్లు మోగకపోవడంపై అధికార యంత్రాంగాన్ని తప్పుబడుతున్నారు. హెచ్చరిక సంకేతాలు ఇచ్చి ఉంటే పెద్ద ఎత్తున ప్రాణనష్టం తప్పేదంటున్నారు.


అమెరికాకు చెందిన హవాయి ద్వీప సమూహంలోని మావీయ్ దీవిలో ఈ నెల 8న కార్చిచ్చు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దావాగ్ని ధాటికి వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 3 వేలకు పైగా ఇళ్లు, వందలాది వాహనాలు కాలి బూడిదయ్యాయి. 50 వేల కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లింది. మావీయ్‌ దీవిలో కార్చిచ్చు చెలరేగిన సమయంలో హెచ్చరిక సైరన్లు పనిచేయలేదని తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన సమయంలో దీవిలోని సైరన్లు పనిచేయలేదని.....ఒకవేళ అవి సరిగ్గా పనిచేసి ఉంటే ప్రాణ నష్టం పెద్ద ఎత్తున ఉండేది కాదని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని అమెరికాకు చెందిన ఓ వార్తా సంస్థ ప్రస్తావించింది. స్థానికులను సంప్రదించి వారి నుంచి వివరాలు సేకరించింది.


గతంలో సునామీలు, ఇతర ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తమను అప్రమత్తం చేసిన సైరన్లు ఇప్పడు ఎందుకు పనిచేయలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్చరిక సంకేతాలు ఎందుకు పని చేయలేకపోయాయో అధికారులు సమాధానం చెప్పాలన్నారు. మావీయ్ దీవి అంతటా కలిపి దాదాపు 80 సైరన్లు ఉంటాయనీ....అధికారులు వాటి ద్వారా ప్రజల్నిహెచ్చరించి ఉంటే మృతుల సంఖ్య ఇంతలా ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.

మావీయ్‌లో దావాగ్ని కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రాణాలు కాపాడుకోవడానికి అధిక సంఖ్యలో ప్రజలు దీవిని వదిలి వెళ్లారు. మావీయ్ దీవిలో దావాగ్ని కారణంగా మరణించిన వారి సంఖ్య మంగళవారం నాటికి 106కి పెరిగింది. మృతుల్లో ఇప్పటివరకు ఐదుగురిని మాత్రమే అధికారులు గుర్తించారు. పోలీసు జాగిలాలతో శిథిలాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మృతుల సంఖ్య రెండింతలు పెరిగే అవకాశముందని హవాయి గవర్నర్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story