Israel Hamas War: గాజాలో ఆకలి కేకలు..

Israel Hamas War: గాజాలో ఆకలి కేకలు..
ఆహార సరఫరా ట్రక్కులపై దాడులు..

ఇజ్రాయెల్ దాడులతో గాజాలో ఆహారం దొరక్క ప్రజలు కలుపు మొక్కలు తిని కాలం వెళ్లదీస్తున్నట్టు ఇప్పటికే వార్తలు రాగా... తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. దాదాపు నెల తర్వాత ఉత్తర గాజాలోకి వచ్చిన ఒక మానవతా సాయం ట్రక్కుల వెంట వేలాది మంది పరుగెత్తినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారని ఇజ్రాయెల్ తెలిపింది. అయితే ఇజ్రాయెల్ దళాల దాడుల వల్లే వందల మంది గాజా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారులు ఆరోపించారు.

గతేడాది అక్టోబర్ 7న హమాస్ దాడులతో ఇజ్రాయెల్-గాజా మధ్య మొదలైన యుద్ధంతో అమానవీయ దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. ఆహారం దొరక్క చాలా వరకూ గాజా ప్రజలు కలుపు మొక్కలు తింటూ బతుకు వెళ్లదీస్తున్నారు. దాదాపు ఓ నెల తర్వాత మానవతా సాయం అందించే ట్రక్కులు ఉత్తర గాజాలోకి రాగా వేలాది మంది ప్రజలు ఆ వాహనాలపైకి ఎగబడ్డారని తెలుస్తోంది.ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్‌-డిఫ్ విడుదల చేసింది. పిండి, మందులు ఇతర సామగ్రి కోసం వేలాది మంది ఒక్కసారిగా గుమిగూడటంతో తొక్కిసలాట జరిగిందని పేర్కొంది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది.

మరోవైపు.. మానవతా సాయం ట్రక్కుల వద్దకు తాము సరుకుల కోసం వెళ్లగా ఇజ్రాయెల్ సైన్యం కాల్పులకు పాల్పడిందని... గాజా ప్రజలు ఆరోపించినట్టు పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ ఘటనలో వంద మందికిపైగా మరణించినట్టు..... బాధితులు తెలిపినట్టు సమాచారం. ఇజ్రాయెల్ దళాల కాల్పులతో.. చేతులు, కాళ్లలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో

ఆహారాన్ని, సామగ్రిని అక్కడే వదిలేసి పారిపోయామని.. అక్కడ ఉన్న వారు చెప్పినట్టు అంతర్జాతీయ మీడియా సంస్థలుపేర్కొన్నాయి. గాజా ఆరోగ్య అధికారులు మాత్రం అంతకుముందు ఇదే ఘటనపై భిన్నమైన సమాధానం చెప్పారు. ఇజ్రాయెల్ దళాల బాంబు దాడుల్లో 100మందికిపైగా గాజా ప్రజలు మరణించారనీ 760 మందికిపైగా గాయపడ్డారని పేర్కొన్నారు.

ఇజ్రాయెల్-గాజా మధ్య యుద్ధం మొదలైన నాటి నుంచిగాజాలోని 23 లక్షల మంది ప్రజల్లో 25 శాతం మందికి ఆహారం దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్య సమితి తెలిపింది. 80 శాతానికి పైగా తమ ఇళ్లను వదిలివేరే చోటుకు తరలి వెళ్లారని పేర్కొంది

Tags

Read MoreRead Less
Next Story