Farmers Protest: ఐరోపా దేశాల్లో రైతుల ఆందోళనలు

Farmers Protest: ఐరోపా దేశాల్లో రైతుల ఆందోళనలు
సాగు గిట్టుబాటు కావడం లేదంటూ పెద్ద ఎత్తున ఆందోళన

ఐరోపా దేశాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఫ్రాన్స్ , జర్మనీ, స్పెయిన్ , బెల్జియం, తదితర దేశాల్లో ఎరువులు, క్రిమినాశనులు, విత్తనాలు, డీజిల్ , సాగునీటి ధరలు పెరిగిపోవడంతో వారు ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లోని ఐరోపా సమాఖ్య కార్యాలయంలో EU వ్యవసాయ మంత్రుల సమావేశం జరుగుతుండగా సుమారు 900 ట్రాక్టర్లతో రైతులు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు బారీకేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసినా వాటిని దాటేందుకు యత్నించారు. కొందరు రైతులు ఓ ట్రాక్టర్ తో కాంక్రీటు దిమ్మెలను తొలగించేందుకు యత్నించారు. ఆందోళనకారుల్లో కొందరు పోలీసులపైకి కోడి గుడ్లు, రంగులు వెదజల్లే క్యాన్లను విసిరారు. రోడ్డుపై ఎండు గడ్డిని కాల్చారు. అప్రమత్తమైన పోలీసులు వారిపై జల ఫిరంగులు ప్రయోగించారు.

ఈ మధ్యకాలంలో యూరప్ దేశాల్లో రైతులు ఆందోళనబాట పట్టి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజా ఆందోళనలు కేవలం ఫ్రాన్స్‌కు మాత్రమే పరిమితం కాలేదు. పోలాండ్, జర్మనీ, నెదర్లాండ్స్, తాజాదా చెకియాలోనూ రైతుల ఆందోళనలు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఈ రైతులు ఎందుకు ఆగ్రహించారు? ఏకంగా రహదారులను దిగ్బంధించి నగరాల్లోకి చొచ్చుకొచ్చే అవసరం ఏమొచ్చింది?

ఫ్రాన్సులో పోరుబాట పట్టిన రైతులు, వారి సమస్యల పట్ల ఆ దేశాధ్యక్షులు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రభుత్వంలోని మితవాద సభ్యులు సానుభూతితోనే వ్యవహరిస్తున్నారు. అయినా సరే అక్కడి రైతులు వెనక్కితగ్గడం లేదు. ఈ పరిస్థితి కారణం పర్యావరణాన్ని పరిరక్షించే ఉద్దేశంతో యురోపియన్ యూనియన్ ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయాలకు తోడు ఆయా దేశాలు అమలు చేస్తున్న గ్రీన్ పాలసీలే కారణమని తెలుస్తోంది. యూరోపియన్ గ్రీన్ డీల్‌లో పొందుపర్చిన అంశాల గురించి వ్యవసాయ లాబీ చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేసింది. 2023 వేసవిలో ఈ డీల్ ఆమోదం పొందకముందే వ్యవసాయ రంగం నుంచి యూరప్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. పర్యావరణ వ్యవస్థలలో జీవవైవిధ్యాన్ని రక్షించడానికి, మెరుగుపరచడానికి ఉద్దేశించిన యురోపియన్ యూనియన్ “నేచర్ రిస్టోరేషన్ లా” ఈ మొత్తం ఆందోళనకు బీజం వేసింది. తాము వ్యతిరేకిస్తున్నప్పటికీ ఈ సరికొత్త చట్టం, నిబంధనలు తీసుకురావడంపై యురోపియన్ రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆ ఆగ్రహానికి ప్రతిరూపమే ఇప్పుడు వివిధ యూరప్ దేశాల్లో కనిపిస్తున్న దృశ్యాలు. యూరప్‌లోని అనేక ప్రాంతాల్లో ఏకకాలంలో నిరసనలు వెల్లువెత్తాయి. బ్రస్సెల్స్‌లోని యూరోపియన్ కౌన్సిల్ కార్యాలయం సహా వివిధ దేశాల్లో రహదారులపై రైతులు ట్రాక్టర్లతో వెల్లువెత్తారు.


దీంతో పాటు మరొక అంశం కూడా యురోపియన్ రైతుల్లో అసహనానికి కారణమైంది. యురోపియన్ యూనియన్ సభ్యదేశాల్లో అమలవుతున్న అసమాన నిబంధనల కారణంగా తాము మిగతా ప్రపంచ రైతులతో స్వేచ్ఛా వాణిజ్యం విషయంలో పోటీపడలేకపోతున్నామని రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. పర్యావరణపరమైన నియంత్రణలు, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ఐరోపా రైతులను దెబ్బతీశాయి. యుద్ధంవల్ల రష్యా నుంచి చమురు, సహజవాయువు దిగుమతులపై అమెరికా, ఈయూలు ఆంక్షలు విధించడంతో ఇంధన ధరలు పెరిగాయి. దీనికి తోడు ఎరువులు, విత్తనాల ధరలు కూడా పెరగడంతో రైతులు ఆందోళనలు చేస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story