Indian Navy Warship : సముద్రపు దొంగల ఆధీనంలో బంగ్లా షిప్‌.

Indian Navy Warship : సముద్రపు దొంగల ఆధీనంలో బంగ్లా షిప్‌.
కాపాడేందుకు వెళ్లిన భారత నేవీపై కాల్పులు.

సముద్రపు దొంగల ఆధీనంలో ఉన్న బంగ్లాదేశ్ షిప్ ద్వారా అత్యవసర సందేశం వచ్చింది. దీనిపై భారత నావికాదళానికి చెందిన యుద్ధనౌక స్పందించింది. బంగ్లాదేశ్‌ షిప్‌ను నిరంతరం గమనిస్తున్నట్లు ఇండియన్‌ నేవీ పేర్కొంది. బంగ్లాదేశ్‌కు చెందిన బల్క్ క్యారియర్ ఎంవీ అబ్దుల్లా 55,000 టన్నుల బొగ్గుతో మొజాంబిక్ రాజధాని మపుటో నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు బయలుదేరింది. మార్చి 12న సోమాలియా తీరంలో సాయుధులైన సముద్రపు దొంగలు ఆ కార్గో షిప్‌పై దాడి చేశారు. అందులోకి చేరుకోవడంతోపాటు బంగ్లాదేశ్‌కు చెందిన 23 మంది సిబ్బందిని నిర్బంధించారు.

కాగా, సముద్రపు దొంగల దాడి సందర్భంగా బంగ్లాదేశ్ షిప్ నుంచి అత్యవసర ఎస్‌ఓఎస్‌ సందేశం వచ్చింది.దీంతో ఇండియన్‌ నేవీకి చెందిన యుద్ధ నౌక వెంటనే స్పందించింది. లాంగ్ రేంజ్ మారిటైమ్ పాట్రోల్ విమానాన్ని రంగంలోకి దించింది. ఎంవీ అబ్దుల్లా కార్గో షిప్‌ను అది సమీపించింది. సాయుధులైన సముద్ర దొంగలు ఆ షిప్‌లో ఉన్నట్లు గమనించింది. సిబ్బంది పరిస్థితి గురించి తెలుసుకునేందుకు కమ్యూనికేషన్‌ కోసం ప్రయత్నించింది. అయితే ఆ షిప్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదని భారత నౌకాదళం తెలిపింది. ఈ నేపథ్యంలో దానిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది.

మరోవైపు ఇండియన్ నేవీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఇండియన్ నేవీ హెలీకాఫ్టర్‌పై సముద్రపు దొంగలు తుపాకీతో దాడి చేస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో అది. బంగ్లాదేశ్‌కు చెందిన బల్క్ క్యారియర్ ఎంవీ రాయెన్ ఓడను సోమాలియా సముద్రపు దొంగలు గత ఏడాది డిసెంబర్ 14న హైజాక్ చేశారు. ఆ షిప్ నుంచి తాజాగా భారత నేవీకి ఓ సందేశం వచ్చింది.

హైజాక్ అయిన ఆ కార్గో షిప్‌ను గుర్తించిన ఇండియన్ నేవీ మార్చి 15వ తేదీన ఓ ఛాపర్‌ను పంపించింది. ఆ ఛాపర్‌పై సముద్రపు దొంగలు దాడికి దిగారు. ఓ పైరేట్ ఓడ నుంచి కాల్పులు జరపడం వీడియోలో కనిపిస్తోంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం.. ఆత్మ రక్షణ కోసం, సముద్రపు దొంగలను ఎదుర్కోవడం కోసం, వారిని న్యూట్రలైజ్ చేయడం కోసం చాలా తక్కువ శక్తితో ఇండియన్ నేవీ కాల్పులు జరిపింది. ఓడను విడిచిపెట్టాలని, బందీలుగా ఉన్న పౌరులను విడిచిపెట్టాలని ఇండియన్ నేవీ సముద్రపు దొంగలను కోరింది.

Tags

Read MoreRead Less
Next Story