Singapore president : సింగపూర్ దేశాధ్యక్ష పీఠంపై మనవాడు

Singapore president : సింగపూర్ దేశాధ్యక్ష పీఠంపై మనవాడు
ఎన్నికల్లో భారత సంతతి నేత ఘనవిజయం

సింగపూర్‌ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి, మాజీ మంత్రి ధర్మన్‌ షణ్ముగరత్నం చరిత్ర సృష్టించారు. సింగపూర్‌ అధ్యక్ష ఎన్నికల్లో విజయ దుందుభి మోగించినట్లు ఎన్నికల కమిటీ ధ్రువీకరించింది. ఆయనకు పోటీ గా ఉన్న ఇద్దరు చైనా సంతతి వ్యక్తులను వెనక్కి నెట్టి ఆయన విజయం సాధించారు. ఈ త్రిముఖ పోటీలో ఆయనకు 70 శాతం ఓట్లు వచ్చాయని అక్కడి ఎన్నికల విభాగం తెలిపింది. ఈ ఎన్నికల్లో మొత్తం 27 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన ప్రత్యర్థులు ఎంగ్‌ కోక్‌సోంగ్‌, టాన్‌ కిన్‌ లియాన్‌లకు వరుసగా 15.7 శాతం, 13.88శాతం ఓట్లు వచ్చినట్టు ఎన్నికల కమిటీ అధికార ప్రతినిధి వెల్లడించారు.

థర్మన్ 1957 ఫిబ్రవరి 25న సింగపూర్ లో ఒక తమిళ తండ్రికి, ఒక చైనీస్ తల్లికి జన్మించారు. తండ్రి కనకరత్నం షణ్ముగరత్నం ప్రసిద్ధ పాథాలజిస్ట్, క్యాన్సర్ పరిశోధకుడు, తల్లి గృహిణి. విభిన్నమైన, గొప్ప సాంస్కృతిక వాతావరణంలో పెరిగిన ధర్మన్ ఆంగ్లం, తమిళం, మలయ్, మాండరిన్‌ భాషలలో ప్రావీణ్యం సంపాదించారు.

లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ, కేంబ్రిడ్జ్, హార్వర్డ్ ల నుంచి మాస్టర్స్ డిగ్రీలు పొందారు. థర్మన్ తన వృత్తిని సింగపూర్ సెంట్రల్ బ్యాంక్, ఫైనాన్షియల్ రెగ్యులేటర్ అయిన మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ లో ప్రారంభించారు. సింగపూర్ జీఐసీకి డిప్యూటీ చైర్మన్ గా పనిచేశారు. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో సింగపూర్ కు మార్గనిర్దేశం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.


2001లో సింగపూర్ అధికార పార్టీ పీపుల్స్ యాక్షన్ పార్టీ (పీఏపీ) తరఫున పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన ధర్మన్ రాజకీయాల్లోకి వచ్చారు. విద్య, ఆర్థికం, మానవ వనరులు, సామాజిక విధానాలు సహా వివిధ మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. 2011లో ఉపప్రధానిగా నియమితులైన ఆయన ప్రధాని లీ సియెన్ లూంగ్ తో కలిసి పనిచేశారు. 2011 నుంచి 2019 వరకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) విధాన నిర్ణాయక సంస్థ ఇంటర్నేషనల్ మానిటరీ అండ్ ఫైనాన్షియల్ కమిటీ (ఐఎంఎఫ్సీ) చైర్మన్ గా పనిచేశారు. ఈ పదవిని చేపట్టిన తొలి ఆసియన్ ఆయనే కావడం విశేషం.

స్వతంత్ర అభ్యర్థిగా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి 2023 జూలైలో థార్మన్ పీఏపీకి రాజీనామా చేశారు. ధర్మన్ తన వినయం, చరిష్మా, వాక్చాతుర్యానికి ప్రసిద్ది చెందారు. చదవడం, సైక్లింగ్, చదరంగం ఆటలంటే ఆయనకు ఇష్టం.

తన భారతీయ వారసత్వం పట్ల తాను గర్వపడుతున్నానని, అయితే తనను తాను సింగపూర్ వాసిగా భావిస్తానని చెప్పే థర్మన్ సింగపూర్ లో సామాజిక ఐక్యత, జాతి సామరస్యం, యోగ్యత కోసం కృషి చేస్తానని తెలిపారు.


Tags

Read MoreRead Less
Next Story