Canada : భారతీయ విద్యార్థులకు కొత్త కష్టాలు

Canada : భారతీయ విద్యార్థులకు కొత్త కష్టాలు
ఉద్యోగాల్లేక క్యాబ్ డ్రైవర్లు, హెల్పర్లుగా...

కెనడా-భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారతీయ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు దొరకడం లేదు. దీంతో వారు తీవ్ర ఆందోళనలకు లోనవుతున్నారు. అంతర్జాతీయ విద్యా సంబంధిత వేదిక ఎర్యుడెరా నివేదిక ప్రకారం.. కెనడాలో మొత్తం విదేశీ విద్యార్థుల సంఖ్య 807,750. వీరిలో 551,405 మందికి గతేడాది స్టడీ పెర్మిట్ వచ్చింది. వీరిలో దాదాపు సగం మంది భారతీయులు ఉన్నారు.

ఖలీస్థానీ తీవ్రవాది నిజ్జర్ హత్య విషయంలో భారత్‌పై కెనడా ప్రధాని చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో కెనడాలోని భారతీయ విద్యార్థులు సరైన ఉద్యోగాలు దొరక్క తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. గతేడాది 2,26,450 మంది భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం కెనడాకు వెళ్లారు. అయితే ఇప్పుడు వారంతా ‘భారత్‌-కెనడాల మధ్య చోటుచేసుకున్న పరిణామాల కంటే తమ భవిష్యత్తు మీదే ఆందోళన ఎక్కువగా ఉందని చెబుతున్నారు .కెనడాలో తీవ్రమైన ఉద్యోగాల కొరత ఉందని వారి ఉన్నత విద్య పూర్తయ్యేసరికి ఉద్యోగం దొరుకుతుందో లేదో తెలియడంలేదని భారతీయ విద్యార్థులు వాపోతున్నారు.


టొరంటోలోని అనేక మంది భారత విద్యార్థులది ఇదే పరిస్థితి. వైద్య పట్టాలు పొందిన తరువాత కూడా చాలామందికి మంచి జీతాలిచ్చే ఉద్యోగాలు దొరకడం లేదు. ఈ విధంగా అనేక మంది క్యాబ్‌లు నడుపుతూ, దుకాణాలు, రెస్టారెంట్లలో పనిచేస్తూ తమ బిల్లులు కట్టుకుంటున్నారు’’ అని ఓ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి తోడు టొరంటో దాని చుట్టుపక్కల నగరాల్లో ఉండే అత్యధిక జీవన వ్యయ పరిస్థితులు విద్యార్థులకు మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారాయి. దీనితో ఎక్కువ మంది నెలవారీ ఇంటి అద్దెలు, ఇతర ఖర్చులు తగ్గించుకునేందుకు ఇరుకైన గదుల్లో కాలం గడుపుతున్నారు. ఆస్తులు అమ్మో, తాకట్టు పెట్టో, రూ.లక్షలు బ్యాంకుల్లో అప్పులు చేసో ఉన్నత చదువుల కోసం కెనడా వస్తే... చదువు తరువాత తగిన ఉద్యోగం దొరక్కపోతే తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన ఇప్పుడు వారిని వెన్నాడుతోంది.


Tags

Read MoreRead Less
Next Story