Charlie Munger | వారెన్‌ బఫెట్‌ వ్యాపార భాగస్వామి చార్లీ ముంగేర్‌ కన్నుమూత

Charlie Munger | వారెన్‌ బఫెట్‌ వ్యాపార భాగస్వామి చార్లీ ముంగేర్‌ కన్నుమూత
చార్లీ మరణంపై బఫెట్ సంతాపం

ప్రపంచ కుబేరుడు వారెన్‌ బఫెట్‌కు అత్యంత నమ్మకస్తుడు, వ్యాపార భాగస్వామి అయిన చార్లీ ముంగేర్‌ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 99 ఏళ్లు. కాలిఫోర్నియాలోని ఓ ఆసుపత్రిలో మంగళవారం మరణించినట్లు వారెన్‌ బఫెట్‌ హోల్డింగ్‌ కంపెనీ బెర్క్‌షైర్‌ హత్‌వే ఓ ప్రకటనలో తెలిపింది. ముంగేర్‌ మరణంపై వారన్‌ బఫెట్‌ కూడా స్పందించారు. బెర్క్‌షైర్‌ హత్‌వే ఈ స్థాయికి చేరడానికి చార్లీ సహకారం మర్చిపోలేనిదన్నారు. ‘చార్లీ స్ఫూర్తి, జ్ఞానం, సహకారం లేకుండా బెర్క్‌షైర్‌ హత్‌వే ఈ స్థాయికి చేరుకోలేదు’ అని అన్నారు.

వారెన్‌ బఫెట్‌కు చార్లీ ముంగేర్‌ కుడి భుజం లాంటివాడు. దాదాపు 60 ఏళ్లుగా ఎంతో నమ్మకస్తుడిగా మెలిగాడు. 1959లో తొలిసారిగా చార్లీ, బఫెట్ ఒకరికొకరు పరిచయమయ్యారు. అప్పుడు మొదలైన వారి స్నేహ బంధం ఏకంగా 6 దశాబ్దాల పాటు సాగింది. 1978లో చార్లీ బర్క్‌షైర్‌ హాథ్‌వేలో వైస్ చైర్మన్‌గా చేరారు. బఫెట్‌తో కలిసి ఆయన.. చిన్న టెక్స్‌టైల్ కంపెనీగా ఉన్న హాథ్‌వే బర్క్‌షైన్‌ను ఓ భారీ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థగా అభివృద్ధి చేశారు.

మరోవైపు చార్లీ మరణవార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ సైతం చార్లీకి నివాళులర్పించారు. ‘వ్యాపారంతోపాటు ఆయన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చార్లీ బాగా పరిశీలిస్తాడు. సంస్థను నిర్మించడంలో ఆయన నైపుణ్యాలు ఇతరులకు ప్రేరణగా ఉండేవి. ఇకపై ఆయన్ని బాగా మిస్‌ అవుతాం’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.


మరోవైపు అపరకుబేరుడు, వ్యాపారవేత్త వారెన్ బఫెట్ దాదాపుగా తన ఆస్తిమొత్తాన్ని విరాళమిచ్చేందుకు నిర్ణయించారు. తన మరణానంతరం ఆస్తిలో 99 శాతానికి పైగా తమ కుటుంబ నిర్వహణలోని చారిటబుల్ ట్రస్టులకు చెందేలా వీలునామా రాసినట్టు ఆయన తాజాగా వెల్లడించారు. ఈ విల్లును అమలుపరిచే బాధ్యత తన కుమారులు తీసుకున్నారని పేర్కొన్నారు. బర్క్‌షైర్ హాథ్‌వే సంస్థలో తనకున్న 1,600 క్లాస్ ఏ షేర్లను 24,00,000 క్లాస్ బీ షేర్లుగా మార్చినట్టు మార్కెట్ నియంత్రణ సంస్థకు వెల్లడించారు. ఈ మేరకు షేర్ హోల్డర్లకు నవంబర్ 21న లేఖ రాశారు.

పారంపర్య ఆస్తులన్నవి ప్రపంచవ్యాప్తంగా ఉన్నవే అయినా ఇది మంచిది కాదని తనతో పాటూ తన కుమారుల విశ్వాసమని వారెన్ బఫెట్ తెలిపారు. మనిషిని సంపద దుష్టుడిగా లేదా ఉన్నతుడిగా మార్చదని కూడా వ్యాఖ్యానించారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో లోపాలు ఉన్నప్పటికీ అది ఎన్నో అద్భుతాలు కూడా సృష్టించిందన్నారు. తన ముగ్గురు కుమారులు ట్రస్టు వ్యవహారాలు చూస్తారని, కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటారని వెల్లడించారు. మరణం ఎప్పుడు వస్తుందో తెలీదు కాబట్టి, ఆస్తికి వారసులను ప్రకటించడం వివేకమైన చర్యగా పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story