Israel Hamas Conflict: రఫాపై ఇజ్రాయెల్ భీకర దాడులు

Israel Hamas Conflict: రఫాపై ఇజ్రాయెల్ భీకర దాడులు
హమాస్ అగ్రనేత యాహ్యా సిన్వార్‌ పైన కూడా..

హమాస్ అంతమే లక్ష్యంగా పెట్టుకున్న ఇజ్రాయెల్ దక్షిణ గాజాపై విరుచుకుపడుతోంది. ఖాన్‌ యూనిస్‌తో పాటు రఫా పట్టణంలోని శరణార్థి శిబిరాలు, ఆసుపత్రుల సమీపంలోనూ దాడులు చేస్తోంది. భూతల దాడులు కొనసాగిస్తూనే...బాంబుల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 20మంది తమ ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్టు గాజా ప్రకటించింది. మరోవైపు కాల్పుల విరమణ కోసం హమాస్‌కు చెందిన ఓ నేత కైరోకు వెళ్లి సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది.

దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. హమాస్ అంతమే లక్ష్యంగా శరణార్థి శిబిరాలు, ఆస్పత్రులకు సమీపంలోనూ ఉద్ధృతంగా బాంబులను జారవిడుస్తోంది. ఇప్పటికే దక్షిణ గాజాలోని ఖాన్‌ యూనిస్‌ నుంచి రఫా పట్టణానికి వలస వచ్చిన ప్రజలతో శిబిరాలు కిక్కిరిసిపోగా తాజా దాడులతో అక్కడ పరిస్థితి దయనీయంగా మారింది. ఇజ్రాయెల్ దాడుల్లో మంగళవారం 28 మంది తమ పౌరులు మరణించినట్టు పేర్కొన్న గాజా అధికారులు తాజాగా జబలియా శరణార్థి శిబిరం వద్ద జరిగిన దాడిలో 20 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ప్రకటించారు. ఈ ఘటనలో 25 తీవ్రంగా గాయపడినట్టు చెప్పారు.సాహ్‌బౌరాలోని మరో శిబిరంలో జరిగిన దాడిలో ఒకరు మరణించినట్టు పేర్కొన్నారు.

హమాస్‌ కీలక నేతలను మట్టుబెట్టేందుకు ఇజ్రాయెల్ తీవ్రంగా యత్నిస్తుండగా ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. హమాస్ అగ్రనేత యాహ్యా సిన్వార్‌ రెండు సందర్భాల్లో ఇజ్రాయెల్‌ దళాల నుంచి త్రుటిలో తప్పించుకొన్నట్టు తెలుస్తోంది. టైమ్స్‌ ఆఫ్‌ ఇజ్రాయెల్‌ పత్రిక తన కథనంలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. సిన్వార్‌ను వేటాడేందుకు ఇజ్రాయెల్‌ బలగాలు ఖాన్‌ యూనిస్‌ దక్షిణ ప్రాంతంపై దృష్టిపెట్టాయనీ ఉత్తర గాజాలో యుద్ధం మొదలైన తొలినాళ్లలో సిన్వార్‌ శరణార్థుల మధ్య తలదాచుకొని దక్షిణ ప్రాంతానికి చేరినట్లు భావిస్తున్నట్టు తెలిపింది. అతడు ఇక్కడే తలదాచుకొన్నట్లు IDF బలంగా నమ్ముతోందని పేర్కొంది.

ఇజ్రాయెల్-హమాస్‌ మధ్య భీకర పోరు జరుగుతున్న వెళ హమాస్‌ వద్ద ఉన్న బందీల విడుదలపై ఆశలు రేకెత్తించే పరిణామం చోటు చేసుకుంది. హమాస్‌ రాజకీయ విభాగానికి చెందిన ఇస్మాయిల్‌ హనియా అనే నేత బుధవారం ఈజిప్ట్‌ రాజధాని కైరో నగరానికి వెళ్లినట్టు తెలుస్తోంది. యుద్ధ పరిస్థితిపై ఆయన ఈజిప్ట్‌ అధికారులతో చర్చలు జరిపారని హమాస్‌ తెలిపింది. గాజాలో కాల్పుల విరమణపై చర్చలు జరిపేందుకు హనియా వెళ్లినట్టు పలు ఆంగ్ల మీడియాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా బందీల విడుదల అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. హనియాతో పాటు కీలక హమాస్‌ నేతలు కూడా కైరో వెళ్లారని తెలుస్తోంది. ఇజ్రాయెల్-హమాస్‌ మధ్య దాడులు మొదలైన నాటి నుంచి 20 వేల మందికి పైగా పాలస్తీనా ప్రజలు మరణించినట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. హమాస్ దాడుల్లో 12 వందల మంది తమ ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్టు ఇజ్రాయెల్ తెలిపింది

Tags

Read MoreRead Less
Next Story