Israel : 24గంటల సమ్మె చేసిన డాక్టర్లు

Israel :  24గంటల సమ్మె చేసిన డాక్టర్లు
న్యాయ వ్యవస్థ పై దాడికి నిరసనగా ఆందోళనలు

ఇజ్రాయిల్‌ న్యాయ వ్యవస్థపై ప్రభుత్వం జరుపుతున్న దాడిని నిరసిస్తూ స్థానిక డాక్టర్లు 24గంటల సమ్మె నిర్వహించారు. ప్రక్షాళన పేరుతో తీసుకువస్తున్న మొదటి విడత చర్యలను ప్రభుత్వం ధృవీకరించడంపై ఆందోళనలు జరుగుతున్నాయి.ఈ చర్యలు న్యాయ స్థానాల స్వేచ్ఛకు ముప్పుగా పరిణమిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మంగళవారం నాటి వార్తాపత్రికల మొదటి పేజీలు బ్లాక్‌ యాడ్స్‌తో నిండిపోయాయి. ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను సుప్రీం కోర్టు సమీక్షించడానికి రద్దు చేస్తూ ప్రభుత్వం బిల్లు తీసుకువచ్చింది. ఆ బిల్లును సోమవారం పార్లమెంట్‌ ఆమోదించింది. బిల్లును నిరసిస్తూ ప్రతిపక్షాల సభ్యులు సభ నుండి వాకౌట్‌ చేశారు. సుదీర్ఘకాలం దేశానికి ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నెతన్యాహు దేశాన్ని నియంతృత్వం దిశగా నడుపుతున్నారని విమర్శించారు.


ప్రభుత్వ నిర్ణయాలను, నియామకాలను సమీక్షించే కోర్టు అధికారాలను తొలగిస్తూ నెతన్యాహు ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద న్యాయ సంస్కరణల బిల్లుకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్‌లో నెలల తరబడి నిరసన ప్రదర్శనలు సాగుతున్నాయి. న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేస్తే, నెతన్యాహు ప్రభుత్వ నిరంకుశత్వానికి అడ్డు అదుపు ఉండదని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలాదిమంది వీధుల్లోకి వస్తున్నారు. పోలీసులతో ఆందోళనకారుల ఘర్షణలు జరుగుతున్నాయి. డాక్టర్లే కాదు ప్రభుత్వం గనుక తన ప్రణాళికలతో ముందుకు వెళ్ళినట్లైతే, మిలటరీ రిజర్విస్ట్‌లు కూడా ఎవరూ తమ విధులకు హాజరు కాబోరని ఆందోళన జరుపుతున్న నేతలు చెప్పారు. అయితే అలా విధులకు రాని వారిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు సైన్యం తెలిపింది.

తాజాగా తీసుకున్న నిర్ణయాలతో రాబోయే ఎన్నికల్లో ప్రధాని నెతన్యాహుకు విజయావకాశాలు దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయి. 1996లో నెతన్యాహుకు తొలిసారిగా ఉన్నత పదవికి ఎన్నికయ్యారు. కానీ ఇప్పుడు ఆయన అతిపెద్ద దేశీయ సంక్షేత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు

Tags

Read MoreRead Less
Next Story