Israel: ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి

శుక్రవారం తెల్లవారుజామున ఒక మిసైల్‌తో దాడి చేసిన ఇజ్రాయెల్

ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు మిడిల్ ఈస్ట్‌లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇటీవల వందలాది మిస్సైళ్లు, డ్రోన్లతో ఇరాన్, ఇజ్రాయిల్‌పై దాడి చేసింది. అయితే, ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయిల్ చెప్పింది. ఇదిలా ఉంటే ఇరాన్‌లోని ఒక సైట్‌పైకి ఇజ్రాయిల్ క్షిపణిని ప్రయోగించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా అధికారిని ఉటంకిస్తూ ఏబీసీ న్యూస్ గురువారం ఆలస్యంగా ఈ విషయాన్ని నివేదించింది. ఇరాన్ నగరంలోని ఇసాఫహాన్‌లోని విమానాశ్రయంలో పేలుడు శబ్దం వినిపించిందని, అయితే కారణం వెంటనే తెలియరాలేదని ఇరాన్‌కు చెందిన ఫార్స్ వార్తా సంస్థ తెలిపింది. దీంతో అనేక విమానాలు ఇరాన్ గగనతలం నుంచి మళ్లించబడ్డాయని సీఎన్ఎన్ తెలిపింది. టెహ్రాన్, ఇస్ఫాహాన్, షిరాజ్ నగరాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

ఇరాన్‌లోని ఇస్ఫాహాన్‌లో విమానాశ్రయం, 8వ ఆర్మీ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లకు సమీపంలో పేలుడు శబ్దం వినిపించిందని ఇరాన్ వార్తా సంస్థ ‘ఫార్స్’ పేర్కొంది. ఇరాన్ వైమానిక రక్షణ దళాలు దాడిని తిప్పికొట్టాయని పేర్కొంది. కాగా టెహ్రాన్, ఇస్ఫాహాన్, షిరాజ్ నగరాల మీదుగా వెళ్లే విమాన సర్వీసులను ఇరాన్ అధికారులు తాత్కాలికంగా రద్దు చేసినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ క్షిపణి దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు సిరియా, ఇరాక్‌లలో కూడా పేలుళ్లు జరిగినట్లు పలు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

గత శనివారం ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీ సంఖ్యలో డ్రోన్‌లు, క్షిపణులతో దాడి చేసిన విషయం తెలిసిందే. 300లకుపైగా డ్రోన్లను ప్రయోగించగా కొన్ని మినహా అన్నింటినీ ఇజ్రాయెల్ విజయవంతంగా కూల్చివేసింది. మిత్రదేశం అమెరికాతో కలిసి అడ్డుకుంది. సిరియాలోని డమాస్కస్‌లోని తమ కాన్సులేట్ కార్యాలయంపై దాడికి ప్రతీకారంగా ఈ దాడి చేశామని ఇరాన్ ప్రకటించింది. అయితే ఈ దాడికి సరైన సమయంలో, సరైన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story