Japan: డబ్బు కోసం ఆ మహా తల్లి ఏం చేసిందంటే..

Japan: డబ్బు కోసం ఆ మహా తల్లి ఏం చేసిందంటే..
ఇన్సూరెన్స్‌ కోసం కుమార్తెకు చిత్రహింసలు, 43 సార్లు ఆస్పత్రి పాలు

డబ్బుల కోసం అడ్డమైన పనులు చేసేవాళ్లు చాలా మంది ఉంటారు. అయితే సొంత పిల్లలని కష్టపెట్టేవాళ్ళు అరుదు. అందులోను చెడ్డ తల్లి అసలు ఉండదు అంటారు.. కానీ అదేంటో ఈ మధ్య ఆ ముచ్చట కూడా తీరిపోయింది. కన్న వాళ్ళని అమ్మేసేవాళ్ళు, అర్ధం పర్ధం లేని కారణాలతో ప్రాణాలు తీసేవారు కూడా బయట పడుతున్నారు.

జపాన్ లో ఓ మహాతల్లి కూతురి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆ పిల్లని చిత్రహింసలకు గురిచేసింది. అనారోగ్యం రాగానే కూతురిని ఆసుపత్రి లో చేర్చేది.. ఇలా ఒకసారి, రెండు సార్లు కాదు మొత్తం 43 సార్లు ఆస్పత్రిలో చేర్చింది. తల్లి ప్రవర్తనపై అనుమానం రావడంతో దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.


జపాన్ లో ఒసాక ప్రిఫెక్షర్‌లో ఈ ఘటన జరిగింది. కసుమి నవట అనే ఓ మహిళ ఒక పార్ట్‌ టైమ్‌ ఉద్యోగం చేసేది. కుమార్తెకు హెల్త్ ఇన్సూరెన్స్ చేయించింది. అయితే ఇన్సూరెన్స్‌ కోసం చాలాసార్లు ఆస్పత్రికి తీసుకు వెళ్ళింది. బాలిక ఆరోగ్యం చెడిపోవటం కోసం ఆమె చిన్నారికి తిండి పెట్టకుండా ఉండటం, కొన్ని సార్లు విరోచనాల మందులను కూడా బలవంతంగా వేయించటం చేసేది. దీంతో ఆ చిన్నారికి కెటోటిక్‌ హైపోగ్లైసీమియా అనే వ్యాధి సోకింది. ఫలితంగా ఆమె రక్తంలో షుగర్ లెవెల్స్, మూత్రంలో కీటోన్లు పడిపోయాయి. ఇదే ఛాన్స్ గా పాపను ఆస్పత్రికి తరలించి.. ఇన్సూరెన్స్ డబ్బును క్లెయిమ్ చేసుకునేది. 2018 సంవత్సరం నుంచి కసుమి నవట.. తన కుమార్తెను 43 సార్లు ఆస్పత్రిలో చేర్పించిందని దర్యాప్తులో భాగంగా పోలీసులు గుర్తించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా 5.7 మిలియన్‌ యెన్‌లు అంటే సుమారు రూ. 33 లక్షలు క్లెయిమ్‌ చేసింది.బాలికను ఆస్పత్రిలో చేర్పించానన్న కారణంతో ఆమె పనిచేసే ఆఫీస్‌లో కూడా చాలా సెలవులు పెట్టింది. తల్లి ప్రవర్తనపై ఆస్పత్రి వర్గాలకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు.

రంగం లోకి దిగిన పోలీసులు ఇన్సూరెన్స్ డబ్బు రాగానే తల్లి తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి టూర్లకు వెళ్లినట్లు తెలుసుకున్నారు. దానికి సంబంధించి మెసేజ్‌లను కూడా ఆమె సెల్‌ఫోన్‌లో గుర్తించారు. ఆమె తరచుగా స్నేహితులతో కలిసి తరచూ జల్సాలకు వెళ్లేదని విచారణలో తేలింది. ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు ఆమెను బలమైన ఆధారాలతో అరెస్టు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story