Japan : మూడేళ్లలో సుమారు 3 వేల ఎమర్జెన్సీ కాల్స్.. ఎందుకంటే..

Japan : మూడేళ్లలో సుమారు 3 వేల ఎమర్జెన్సీ కాల్స్.. ఎందుకంటే..
ఒంటరితనం ఓ నరకం అంటున్న జపాన్ మహిళ

ఒక్కరే ఉండాలనుకోవటం ఏకాంతం.. ఒక్కరిగా మిగిలిపోతే ఒంటరితనం..అర్థం చేసుకుంటే రెండిటికీ చాలా చిన్న తేడా.. జపాన్ లో ఓ మహిళ ఇలాంటి కన్ఫ్యూషన్ కి గురైంది.. తన ఒంటరి తనాన్ని పోగొట్టుకోవాలని ప్రయత్నించింది.. కానీ అందుకోసం ఆమె చేసిన పని ఆమెని జైలుకి వెళ్లేలా చేసింది.

దాదాపు మూడేళ్ల వ్యవధిలో 2,761 తప్పుడు ఎమర్జెన్సీ కాల్స్ చేసిన ఓ 51 ఏళ్ల మహిళను జపాన్‌లో అరెస్ట్ చేశారు. రాజధాని టోక్యోలోని మాట్సుడోకు చెందిన హిరోకో హటగామిని, అగ్నిమాపక విభాగం కార్యకలాపాలను అడ్డుకున్నారనే అనుమానంతో గురువారం అరెస్టు చేశారు. కానీ ఆ తరువాత గత రెండు సంవత్సరాల తొమ్మిది నెలలుగా ఆమె తన మొబైల్ ఫోన్ లేదా వేరే మార్గాల నుంచి పదేపదే అత్యవసర కాల్స్ చేసిందని పోలీసులు పసిగట్టారు.


ఇంతకీ ఇన్ని కాల్స్ చేయడానికి కారణం ఏంటని ప్రశ్నిస్తే ఆమె చెప్పిన జవాబు ఒంటరితనమట. తను ఎవరితోనైనా మాట్లాడాలని, తన మాటల్ని ఎవరైనా వినాలని ఆమె కోరుకొనేదట. ఆగస్ట్ 2020 నుంచి మే 2023 మధ్య కడుపు నొప్పి, మాదకద్రవ్యాల అధిక మోతాదు, ఇతర లక్షణాలతో పాటు కాళ్లు నొప్పులు ఉన్నాయని రకరకాల ఫిర్యాదు చేస్తూ, అంబులెన్స్‌లను పంపమని మాట్సుడో అగ్నిమాపక శాఖకు ఆమె పదేపదే కాల్స్ చేసింది.

తీరా అంబులెన్స్‌ వచ్చినప్పుడు, ఆమె ఆసుపత్రికి వెళ్లడానికి నిరాకరించేది. అసలు తాను ఎవరికీ కాల్ చేయలేదని చెప్పి తప్పించుకొనేది. అగ్నిమాపక శాఖ, పోలీసుల నుంచి అనేక హెచ్చరికలు వచ్చినప్పటికీ, మహిళ తన అలవాటు మానుకోలేక పోయింది. చివరికి అగ్నిమాపక శాఖ జూన్ 20 న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అది ఆమె అరెస్టుకు దారి తీసింది.

జపాన్‌లో 15 లక్షల మంది ఒంటరితనం అనుభవిస్తున్నారని ఒక తాజా సర్వే తెలిపింది. కోవిడ్ తరువాత ఈ పరిస్థితి మరింత తీవ్రమైంది. నవంబర్‌లో జపాన్ పిల్లలు, కుటుంబాల ఏజెన్సీ నిర్వహించిన ఒక సర్వేలో 15 నుంచి 64 సంవత్సరాల మధ్య వయస్సు గల వారిలో దాదాపు 2 శాతం మంది ఒంటరివారే.

Tags

Read MoreRead Less
Next Story