JOE BIDEN: చైనా పేలడానికి సిద్ధంగా ఉన్న టైం బాంబు

JOE BIDEN: చైనా పేలడానికి సిద్ధంగా ఉన్న టైం బాంబు
డ్రాగన్‌పై మరోసారి బైడెన్‌ తీవ్ర వాఖ్యలు... చైనా కార్మికశక్తి క్షీణిస్తోందన్న అగ్రరాజ్య అధినేత

చైనాపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌(Joe Biden) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారం చేపట్టినప్పటి నుంచి చైనా(CHINA)పై అమెరికా అధ్యక్షుడు చేసిన అత్యంత తీవ్రమైన వ్యాఖ్యలు ఇవేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. చైనా పేలడానికి సిద్ధంగా ఉన్న బాంబు(bomb) లాంటిదని అన్నారు. చైనాలో పరిస్థితులు మిగిలిన ప్రపంచ దేశాలను కూడా భయపెడుతున్నాయని అభిప్రాయపడ్డారు. చైనాలో ఆర్థిక వృద్ధి(economic growth) దారుణంగా పడిపోయిందని... ఆర్థిక మందగమనం ఆ దేశ పాలకులను(jinping) భయపెడుతోందని బైడెన్‌ ఆరోపించారు. చైనాలో పనిచేసేవారి కంటే రిటైరైపోయేవారి సంఖ్యే అధికంగా ఉందని గుర్తు చేశారు. డ్రాగన్ కార్మిక శక్తి సన్నిగిల్లుతోందని, అది పారిశ్రామిక పురోగతిపై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు.

చైనాలో అత్యధిక నిరుద్యోగ రేటు కొనసాగుతోందని, చెడ్డవారికి సమస్యలుంటే.. వారు మరింత చెడ్డ పనులే చేస్తారని జిన్‌పింగ్‌ను ఉద్దేశించి బైడెన్‌ వ్యాఖ్యానించారు. చైనా చర్యలను వాషింగ్టన్‌ జాగ్రత్తగా గమనిస్తోందని.. దాంతో పోరును కోరుకోవడంలేదని బైడెన్‌ వెల్లడించారు. బెల్ట్‌ అండ్‌ రోడ్‌(one belt- one road) ప్రాజెక్టును రుణ ఉచ్చుగా అమెరికా అధినేత అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు కింద రుణం పొందాలనుకునే దేశాలు చైనా షరతులను కచ్చితంగా ఆమోదించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. అమెరికా సంస్థలు చైనాలో టెక్నాలజీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడంపై ఆంక్షలు బైడెన్‌ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.

గతంలోనూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఘాటుగా హెచ్చరించారు. జాగ్రత్తగా వ్యవహరించకపోతే పర్యవసానాలు తప్పవని వార్నింగ్‌ ఇచ్చాడు. చైనా ఆర్థిక వ్యవస్థ పాశ్చాత్య దేశాల పెట్టుబడులపై ఆధారపడి ఉందనే విషయం మర్చిపోవద్దని అగ్రరాజ్య అధినేత సూచించారు. ఓ ఇంటర్వ్యూలో జిన్‌పింగ్‌ రష్యా పర్యటనపై అడిగిన ప్రశ్నకు బైడెన్‌ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ఉక్రెయిన్‌లోకి రష్యా ప్రవేశించినప్పటి నుంచి 600 అమెరికన్‌ కంపెనీలు ఆ దేశం నుంచి వైదొలిగాయని గుర్తు చేశారు. చైనా ఆర్థిక వ్యవస్థ యూరప్‌, అమెరికా నుంచి వచ్చే పెట్టుబడులపై ఆధారపడి ఉన్నట్లు జిన్‌పింగ్‌ ఒక సందర్భంలో తన చెప్పాడన్న బైడెన్‌... అయితే జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇది బెదిరింపు కాదని... పరిశీలన మాత్రమే అని వ్యాఖ్యానించారు.

అమెరికా-చైనా మధ్య అనేక అంశాల్లో తీవ్రస్థాయి విభేదాలున్నాయి. తైవాన్‌, ఉక్రెయిన్ సంక్షోభం, సాంకేతిక పరమైన అంశాలతో ఇరు దేశాల మధ్య బంధం బలహీనంగా ఉంది. రెండింటి మధ్య ఇటీవల చిప్‌ వార్ మొదలైంది. జాతీయ భద్రత, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఒకదానిపై ఒకటి ఆంక్షలు విధించుకుంటూనే ఉన్నాయి. సమాచార విప్లవానికి వారధిగా ఉన్న సముద్రంలోని ఇంటర్నెట్ కేబుళ్లపై పెత్తనానికి రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. దాంతో.. ఎన్నిరకాలుగా ప్రయత్నించాలో అన్ని రకాలుగా ప్రయత్నించిన అమెరికా ఈ ప్రాజెక్ట్ నుంచి చైనా కంపెనీలను తప్పించడంలో సక్సెస్ అయింది.

Tags

Read MoreRead Less
Next Story