Biden: బైడెన్‌ జ్ఞాపకశక్తికి అవాక్కయిన అమెరికా

Biden: బైడెన్‌ జ్ఞాపకశక్తికి అవాక్కయిన  అమెరికా
హమాస్ పేరు గుర్తురాక ఆపసోపాలు

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు జో బైడెన్ కు రహస్యపత్రాలకు సంబంధించిన నివేదిక అంశాలు ఇబ్బందికలిగించేలా మారాయి. అమెరికా రహస్య పత్రాలను బైడెన్ తనఇంట్లో పెట్టుకోవడంపై ఓ నివేదిక ఇచ్చిన స్పెషల్ కౌన్సిల్ అందులో బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు వ్యక్తం చేసింది. బైడెన్ ను జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్న వృద్ధుడని పేర్కొంది. ఈ విషయం తెలుసుకొన్న బైడెన్ మండిపడ్డారు. తనకు అన్నిగుర్తుంటాయన్నారు. అదే సమయంలో గాజాకు మానవతా సాయం పంపడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్ సిసిని మెక్సికో ప్రెసిడెంట్ గా పేర్కొన్నారు. ఆయన సరిహద్దులు తెరిచి మానవతాసాయం పంపేందుకు ఇష్టపడలేదన్నారు. ఆయనతో మాట్లాడి సరిహద్దు గేట్లు తెరిపించినట్లు బైడెన్ చెప్పారు. ఆ తర్వాత అధ్యక్ష కార్యాలయ ప్రతినిధులు ఆ తప్పును సరిదిద్దాల్సి వచ్చింది. తరువాత తాజాగా మరోసారి ఆయన టంగ్‌ స్లిప్‌ అయ్యి వార్తల్లోకెక్కారు. సమయానికి పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ పేరు గుర్తురాక దాన్ని ‘ప్రతిపక్షం’గా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌కు నిధులు అందించే ద్వైపాక్షిక ఇమ్మిగ్రేషన్, సరిహద్దు ఒప్పందానికి మద్దతు ఇవ్వాలని రిపబ్లికన్లను కోరుతూ మంగళవారం బైడెన్ ప్రసంగించారు. ఆ సమయంలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య బందీల విడుదల చర్చల పురోగతి గురించి అధ్యక్షుడిని మీడియా ప్రశ్నించింది. మీడియా ప్రశ్నకు బైడెన్‌ స్పందిస్తూ.. హమాస్‌ పేరు గుర్తురాక ఆపసోపాలు పడ్డారు. చివరికి తరబడుతూ ‘ప్రతిపక్షం’గా పేర్కొన్నారు. ‘ప్రతిపక్షం నుంచి ప్రతిస్పందన వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చారు. ‘కొంత కదలిక ఉంది‘ అని తడబడుతూ ఆగిపోయిన బైడెన్‌.. ‘నన్ను పదాలు వెతుక్కోనివ్వండి. ప్రతిస్పందన ఉంది. ‘ప్రతిపక్షం’ నుంచి ప్రతిస్పందన వచ్చింది, కానీ..’ అంటూ చెప్పుకొచ్చారు. చివరికి ఒక రిపోర్టర్ ‘హమాస్’ అని చెప్పగానే అవును, నన్ను క్షమించండి అని బైడెన్‌ అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉండి బైడెన్‌ను సవాలు చేస్తున్న డీన్ ఫిలిప్స్ ‘ఎక్స్’లో బైడెన్ ఫుటేజీని పంచుకున్నారు. ‘‘నేను మా అధ్యక్షుడిని అభినందిస్తున్నాను. నేను ఆయనకు ఓటు వేశాను. ప్రచారం కూడా చేశాను. ఆయన మా ఇంటిని సందర్శించారు. మా పట్ల, దేశం పట్ల దయచూపారు. కానీ, మీరందరూ అంతా ఓకే అంటూ నటిస్తున్నందుకు సిగ్గుపడాలి. మీరు మమ్మల్ని, ఆయన(బైడెన్)ను విపత్తులోకి నడిపిస్తున్నారు. ఈ విషయం మీక్కూడా బాగా తెలుసు’’ అని తీవ్ర విమర్శలు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story