అధ్యక్షుడిగా జో బైడెన్ కంటే ముందే ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ ప్రమాణం

అధ్యక్షుడిగా జో బైడెన్ కంటే ముందే ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ ప్రమాణం
బైడెన్ కంటే ముందే ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌తో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సోనియా సోటోమేయర్‌ ప్రమాణం చేయించనున్నారు.

అగ్రరాజ్యం అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలు దాటగానే.. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో బైడెన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. 127 ఏళ్ల కుటుంబ బైబిలుపై ఆయన ప్రమాణం చేస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌.. బైడెన్‌ చేత ప్రమాణం చేయిస్తారు. వాషింగ్టన్‌లోని అమెరికా కాంగ్రెస్‌ భవనం 'క్యాపిటల్‌ హిల్‌'లో ఈ కార్యక్రమం జరగనుంది.

బైడెన్ కంటే ముందే ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌తో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సోనియా సోటోమేయర్‌ ప్రమాణం చేయించనున్నారు. అమెరికా ఉపాధ్యక్ష పదవిని తొలిసారి ఒక మహిళ చేపట్టనున్నారు. భారతీయ మూలాలున్న కమల ఇక మీదట శ్వేతసౌధంలో అత్యంత కీలకపాత్ర పోషించనున్నారు. ఓ రకంగా చెప్పాలంటే పాలన వ్యవహారాల్లో ఆమే కీలకం కానున్నారు.

కేపిటల్‌ భవనంపై దాడి కారణంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత భారీగా 25,000 మంది నేషనల్‌ గార్డ్స్‌తో వాషింగ్టన్‌లో భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. మాజీ అధ్యక్షులు, సెనెటర్లు తదితర వెయ్యి మంది ఆహ్వానితులు మాత్రమే హాజరుకానున్నారు. కరోనా కారణంగా బైడెన్‌ ప్రమాణస్వీకారోత్సవం ఒకింత నిరాడంబరంగానే సాగనుంది. ఆహ్వానితులు మాస్కులు, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి చేశారు. సైనిక వందనం కూడా వర్చువల్‌గానే సాగనుంది.

ప్రమాణ స్వీకారాత్సోవం అనంతరం బైడెన్‌, కమలా హారిస్‌లు జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం వారు శ్వేత సౌధంలోకి అడుగుపెడతారు. అదే సమయంలో అన్ని రాష్ట్రాల్లోనూ వర్చువల్‌ పరేడ్‌లు నిర్వహిస్తారు.

ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రముఖ పాప్‌ సింగర్‌ లేడీ గాగా అమెరికా జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. నటుడు టామ్‌ హ్యాంక్స్‌ నేతృత్వంలో రాత్రి 8.30కు ప్రత్యేక ప్రదర్శన ఉంటుంది. అలాగే ప్రముఖ నటి జెన్నిఫర్‌ లోపెజ్‌, గార్త్‌ బ్రూక్స్‌ల ప్రదర్శనలు కూడా ఉంటాయి.




Tags

Read MoreRead Less
Next Story