కింగ్‌ ఛార్లెస్‌తో బైడెన్‌ భేటీ... చెలరేగిన వివాదం

కింగ్‌ ఛార్లెస్‌తో బైడెన్‌ భేటీ... చెలరేగిన వివాదం
కింగ్‌ ఛార్లెస్‌తో సమావేశమైన అగ్రరాజ్య అధినేత.....ఛార్లెస్‌ వీపుపై చేయి వేసిన బైడెన్‌... చెలరేగిన వివాదం...

బ్రిటన్‌ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. రాజు కింగ్‌ ఛార్లెస్‌తో సమావేశమయ్యారు. చక్రవర్తిగా ఛార్లెస్‌ సింహాసనాన్ని అధిరోహించిన తర్వాత తొలిసారి వీరిద్దరూ అధికారికంగా సమావేశమయ్యారు. విండ్సర్ కాజిల్‌కు వచ్చిన బైడెన్‌కు రాజు ఎదురేగి స్వాగతం పలికారు. అనంతరం రాజ లాంఛనాలతో అగ్రరాజ్య అధినేతకు ఆహ్వానం పలికారు. రాజ సైనికుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం బైడెన్‌ రాజుతో చర్చలు జరిపారు. వాతావరణ మార్పులపై ఇరువురు చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు వైట్‌హౌస్‌ వర్గాలు తెలిపాయి.


అయితే కింగ్‌ ఛార్లెస్‌ను కలిసినప్పుడు బైడెన్‌.. రాయల్‌ ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారని వివాదం చెలరేగింది. అమెరికా అధ్యక్షుడికి ఆహ్వానం పలికే సమయంలో రెండు దేశాల జాతీయ గీతాలను ప్లే చేశారు. ఆ సమయంలో ఆహ్వానం పలుకుతున్న కింగ్‌ ఛార్లెస్‌ వీపుపై బైడెన్‌ చేయి వేశారు. అనంతరం ఆతనితో కరచాలనం చేస్తూ భుజంపై కూడా చేయి వేశారు. సాధారణంగా రాజు ఆహ్వానిస్తున్నప్పుడు అతనిపై చేయి వేయడం రాయల్‌ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడమే అని వివాదం మొదలైంది. సోషల్‌ మీడియాలోనూ దీనిపై నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.


దీనిపై బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ స్పందించింది. బైడెన్‌ రాజును వెనకవైపు తాకడంతో ఎలాంటి ఇబ్బంది లేదని.. అది రెండు దేశాల మధ్య సుహృద్భావ వాతవరణానికి ప్రతీకని తెలిపింది. కింగ్ చార్లెస్ దీనిపై ఎలాంటి ఆందోళన చెందడం లేదని కూడా ప్రకటించింది. వ్యక్తులు, దేశాల మధ్య ఉన్న ఆప్యాయతకు ఇది అద్భుతమైన చిహ్నమని బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ వెల్లడించింది.


అంతకుముందు యూకే ప్రధాని రిషి సునాక్‌తోనూ బైడెన్‌ భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతో పాటు వివిధ అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. ఉక్రెయిన్‌ ఆయుధ నిల్వలు తరిగిపోతుండటంతో క్లస్టర్‌ బాంబుల సరఫరాపై నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని రిషి సునాక్‌కు బైడెన్‌ నచ్చచెప్పినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు సహాయంపై బైడెన్‌, సునాక్‌ల వ్యూహం ఒక్కటేనని, రష్యా దాడిని విజయవంతంగా తిప్పికొట్టడమే వారి లక్ష్యమని ఇరు దేశాలు స్పష్టం చేశాయి. బ్రిటన్‌తో తమ స్నేహం దృఢంగా కొనసాగుతోందని సునాక్‌ అధికారిక నివాసంలో భేటీ తర్వాత బైడెన్‌ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌కు క్లస్టర్‌ బాంబుల సరఫరాపై కెనడా, న్యూజిలాండ్‌ దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. బ్రిటన్‌ పర్యటన ముగిసిన తర్వాత నాటో సమ్మిట్ కోసం బైడెన్‌ లిథువేనియాకు... యుఎస్-నార్డిక్ లీడర్స్ సమ్మిట్ కోసం ఫిన్లాండ్‌కు వెళతారని వైట్ హౌస్ వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story