US-China: 38 ఏళ్ల నాటి జిన్ పింగ్ ఫొటో

US-China: 38 ఏళ్ల నాటి జిన్ పింగ్ ఫొటో
తన ఫోన్ లో ఓ పాత ఫొటో చూపించిన బైడెన్

ఘర్షణలు బెదిరింపులు అలవాటుగా మారిన ప్రపంచంలో ఏడాదిగా మాటమంతీ లేనీ రెండు అగ్ర రాజ్యాలు ఒకచోట కూర్చొని చర్చించుకున్నాయి . అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ల మధ్య కాలిఫోర్నియాలో ద్వైపాక్షిక చర్చలు జరపడం అందులో పురోగతి సాధించామని చెప్పడం ఉపశమనం కలిగించే పరిణామమే.

అయితే చైనా అధినేత షి జిన్ పింగ్ అమెరికాలో పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సమావేశం సందర్భంగా జిన్ పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జిన్ పింగ్ ను బైడెన్ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. సమావేశం సందర్భంగా తన ఫోన్ లో జిన్ పింగ్ కు ఓ ఫొటో చూపించారు. ఆ ఫొటో జిన్ పింగ్ దే. 38 ఏళ్ల నాటి తన ఫొటో చూసుకున్న చైనా అధ్యక్షుడి ముఖంలో చిరునవ్వు కనిపించింది. జిన్ పింగ్ యువకుడిగా ఉన్నప్పుడు అమెరికాలో పర్యటించగా, ప్రఖ్యాత గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ వద్ద తీయించుకున్న ఫొటో అది.

బైడెన్... జిన్ పింగ్ పాత ఫొటోను సేకరించిన విషయాన్ని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హువా చున్ యింగ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. జిన్ పింగ్ కు బైడెన్ చూపిన ఫొటోను కూడా ఆమె పంచుకున్నారు. ఆ సమావేశంలో... "ఈ కుర్రాడు ఎవరో తెలుసా?" అని బైడెన్ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ను అడిగారని ఆమె వెల్లడించారు. దాంతో జిన్ పింగ్ హుషారుగా స్పందించారని, ఈ ఫొటో 38 ఏళ్ల నాటిదని కూడా గుర్తుచేసుకున్నారని చున్ యింగ్ వివరించారు.

అయితే ఈ సమావేశం అనంతరం బయటకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ని ఓ నియంతగానే విశ్వసిస్తున్నానని చెప్పారు. చైనా ప్రభుత్వం తన ప్రభుత్వానికి చాలా తేడా ఉందని అన్నారు. జిన్ పింగ్ ని నియంత లాగే చూస్తున్నారా అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

ఈ సమావేశంలోఇరువురు నేతలు ఇరాన్, పశ్చిమాసియా, ఉక్రెయిన్, తైవాన్, ఇండో ఫసిపిక్ ఆర్థిక సమస్యలు కృత్రిమ మేధస్సు, మాదక ద్రవ్యాల సరఫరా, వాతావరణం వంటి ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చించారు. అమెరికాలో అక్రమ మాదక ద్రవ్యాలు వాణిజ్యం చేపడుతున్న చైనా సంస్థలపై చర్యలు తీసుకుంటామని జిన్‌పింగ్‌ హామీ ఇచ్చారు. తైవాన్ అంశం ఇరు దేశాల మధ్య సంబంధాలకు చాలా సున్నితమైన అంశంగా మారిందని జిన్ పింగ్ అన్నారు. తైవాన్ స్వాతంత్ర్యానికి అమెరికా మద్దతు ఇవ్వకూడదని కోరుతూ ఆయుధ సరఫరాను నిలిపివేయాలని స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story