Canada Reaction: భారత్‌ అల్టిమేటం.. వివాదాన్ని పెంచడం ఇష్టం లేదన్న ట్రూడో..

Canada Reaction: భారత్‌ అల్టిమేటం.. వివాదాన్ని పెంచడం ఇష్టం లేదన్న ట్రూడో..
తెరవెనుక మంతనాలకు సిద్ధమన్న కెనడా

భారత్‌లో ఉన్న దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని న్యూదిల్లీ అల్టిమేటం జారీ చేసిన అంశంపై కెనడా స్పందించింది. ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తగ్గించుకోవడానికి తెరవెనుక చర్చలు జరపాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. భారత్‌లో ఉన్న కెనడా దౌత్యవేత్తల భద్రతను చాలా కీలకంగా పరిగణిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ వెల్లడించారు. మరోవైపు భారత్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితి ఇంకా పెరగాలని తమ దేశం కోరుకోవట్లేదని కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో వ్యాఖ్యానించారు.

భారత్, కెనడాల మధ్య దౌత్యవివాదం మరింత ముదురుతోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ని గుర్తు తెలియని వ్యక్తులు జూన్ నెలలో కెనడాలోని సర్రే ప్రాంతంలో కాల్చి చంపారు. అయితే ఇటీవల ఈ హత్యతో భారత ఏజెంట్లకు సంబంధం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించడంతో వివాదం పెద్దదైంది. దీంతో పాటు కెనడా, భారత సీనియర్ దౌత్యవేత్తను ఆ దేశం నుంచి బహిష్కరించింది. భారత్ ఇందుకు ప్రతిగా కెనడియన్ దౌత్యవేత్తను దేశం వదిలి వెళ్లాలని ఆదేశించింది. అంటే కాదు భారత్‌లో దౌత్య సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలని కెనడాకు దిల్లీ అల్టిమేటం జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి.


ఈ నెల 10లోగా దాదాపు 41 మంది అధికారులను వెనక్కి పిలిపించుకోవాలని ఒట్టావాకు చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ లండన్‌ కేంద్రంగా పనిచేసే ఫైనాన్షియల్‌ టైమ్స్‌ కథనం వెల్లడించింది. ప్రస్తుతం దిల్లీలో కెనడాకు చెందిన 62 మంది దౌత్యసిబ్బంది ఉన్నారు. అందులో 41 మందిని వెనక్కి పిలిపించుకోవాలని కెనడాకు భారత్‌ తేల్చి చెప్పినట్లు సమాచారం. 10లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలని భారత్‌ స్పష్టం చేసింది. అలా జరగకపోతే అదనంగా ఉన్న సిబ్బందికి దౌత్యపరమైన రక్షణను తొలగిస్తామని భారత్‌ హెచ్చరించినట్లు ఆ కథనం వెల్లడించింది దీంతో తమ దౌత్యవేత్తల భద్రతపై కెనడా ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌లో ఉన్న కెనడా దౌత్యవేత్తల భద్రతను చాలా కీలకంగా పరిగణిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ వెల్లడించారు. దౌత్యపరమైన చర్చలు తెరవెనుక సాగించినప్పుడే అత్యుత్తమంగా ఉంటాయన్నారు.

మరోవైపు భారత్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితి ఇంకా పెరగాలని తమ దేశం కోరుకోవట్లేదని కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో వ్యాఖ్యానించారు. తమ దేశం భారత్‌తో కలిసి నిర్మాణాత్మకంగా, బాధ్యతాయుతంగా పనిచేయాలనుకుంటోందన్నారు. భారత్‌లో నివాసముంటున్న కెనడా వాసుల కుటుంబాలకు సాయం చేయాలనుకుంటోందని తెలిపారు. అందుకోసం భారత్‌లో క్షేత్రస్థాయిలో పనిచేయాలని తాము కోరుకుంటున్నట్లు ట్రూడో వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story